బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా మూవీ ట్రెండ్ ను ముందుకు తీసుకువెళ్లింది కన్నడ ఇండస్ట్రీయే అని చెప్పాలి. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించారు వాళ్లు. ఈ మధ్య వచ్చిన కాంతార మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ హార్ట్స్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు అక్కడి నుంచి మరో బిగ్ మూవీ రాబోతోంది. ఈ చిత్రాన్ని ఏకంగా ప్రపంచంలోని అనేక భాషల్లో విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. అన్నిటికి మించి దసరాకు విడుదల కాబోతోందీ సినిమా. ఇంతకీ ఇది ఏం సినిమానో చెప్పలేదు కదా.. ‘మార్టిన్’.
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా నటించిన మూవీ ఇది. విశేషం ఏంటంటే.. ఈ కథను అర్జున్ అందించాడు. తాజాగా ట్రైలర్ విడుదలైంది. పాకిస్తాన్ తో తలపడే ఓ భారత సైనికుడి కథలా కనిపిస్తోందీ మూవీ. పాకిస్తాన్ అనే పాయింట్ తో ఇప్పటికే అనేక సినిమాలు చూసినా..ఇందులో ఇంకేదో యూనిక్ పాయింట్ ఉందన్నట్టుగా ఉందీ ట్రైలర్. రెగ్యులర్ యాక్షన్ మూవీస్ కు భిన్నంగానూ కనిపిస్తుంది. ధృవ్ భారీ కాయుడు. కండలు విపరీతంగా పెంచాడు కూడా. అయినా స్టంట్స్ లో ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ స్టైలిష్ యాక్షన్ చూడబోతున్నాం అనేలా ఉంది.
ఏపి అర్జున్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఉదయ్ మెహతా నిర్మించాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. ధృవ్ సర్జా తో పాటు వైభవీ శాండిల్య, అన్వేషీ జైన్, చిక్కన్న, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీని ఇండియన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ తో పాటు జపనీస్, చైనీస్, అరబిక్, కొరియన్, రష్యన్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నాం అనే ప్రకటన ఆకట్టుకుంటోంది. ధృవ్ ఇంతకు ముందు ఒకటీ రెండు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారిని ఆకట్టుకోవాలనుకున్నాడు కానీ వర్కవుట్ కాలేదు. ఈ సారి ప్యాన్ ఇండియా మార్కెట్ పైనే కన్నేశాడు. అతనికి హిందీ డబ్బింగ్ మార్కెట్ స్ట్రాంగ్ గానే ఉంది. మరి కన్నడ నుంచి వస్తోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ లా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.