RRR చిత్రం ఉత్తమ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు హీరో రామ్ చరణ్. మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డును 'ఆర్ఆర్ఆర్' అందుకోవడం కేవలం చిత్ర యూనిట్ కే పరిమితం కాదని యావత్ దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. భారతీయుల ప్రేమ, సపోర్ట్ తమను ఇక్కడి వరకు తీసుకొచ్చాయని అన్నారు. 85 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఆస్కార్ తమను గుర్తించినందుకు ఆనందంగా ఉందన్నారు.
ఆర్ఆర్ఆర్ లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు చరణ్. జర్నీ మొదలైనప్పుడు మామూలుగానే స్టార్ట్ అయ్యామని, ఇది ఆర్ట్ సినిమా కాదని ప్రజల సినిమా అని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సంగీతానికి తాము డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు 'నాటునాటు'ను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. తాను సీక్వెల్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు. డైరెక్టర్ రాజమౌళి కూడా పలు వేదికలపై ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని తెలిపినట్లు గుర్తుచేశారు.