Paradha Trailer : పరదా.. ప్రేమపేరుతో వేసే ముసుగా..?

Update: 2025-08-09 14:10 GMT

కొన్ని ఆచారాలు కేవలం ఆడవారిని బాధించడానికే ఉంటాయి. వాటి వల్ల వారు జీవితంలో స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసుకోలేరు. అసలు జీవితం అంటే కూడా అర్థం కాదు. అలాంటి ఆచారాల్లో ఒకటి పరదా అనేలా ఉంది తాజాగా విడుదలైన ఈ ‘పరదా’మూవీ ట్రైలర్. ప్రేమ పేరుతో వేసే ముసుగు అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ కూడా ఉంది. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో సంగీత, దర్శన ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. చాలా రోజులుగా ఈ చిత్రం గురించి వినిపిస్తూనే ఉంది. ఫైనల్ గా ఈ నెల 22న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా రామ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా పరదా ట్రైలర్ రిలీజ్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఓ చిన్న గ్రామం. ఆ ఊరికి శాపం అంటూ ఆడవారి మొహాలు కనిపించకుండా పరదా అడ్డం పెట్టడం అనేది ఆచారం. దాని వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడ్డా.. పరదా తీసినా.. కట్టుబాట్లు మీరినా వారికి వారే ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంటుంది అనే నియమం. అలాంటి ఓ స్థితిలోకి వెళ్లిన ఓ అమ్మాయి ఆత్మాహుతి నుంచి తప్పించుకుని బయటి ప్రపంచంలోకి వస్తుంది. అక్కడ కూడా పరదా తీయదు. ఆ టైమ్ లో తనకు మరో ఇద్దరు ఆడవాళ్లు ఎదురవుతారు. తన జీవితానికి, వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన ఆ మనుషులతో కలిసి తను సాగించిన ప్రయాణంలో ఆమె జీవితంలో ఎదురైన ప్రశ్నలు, సమాధానాలు, సవాళ్లు, సంస్కరణలు వంటి అంశాల కలయికగా సినిమా ఉండబోతోంది అనేలా ఉంది ఈ ట్రైలర్.

కంటెంట్ పరంగా సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ ప్రభావం పెద్దగా ఉండేలా ఉంది. ఈ తరహాలో ఇంతకు ముందు బాలీవుడ్ లోనూ ఓ మూవీ వచ్చింది. కాకపోతే అది కాస్త బోల్డ్ గా ఉంటుంది. ఇది ఆలోచింప చేసేలా ఉండొచ్చు అనే ఫీలింగ్ కలిగించింది. ఇంతకు ముందు సినిమా బండి, శుభం చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఆల్రెడీ వచ్చిన ఓ పాట సూపర్ హిట్ అయింది. మొత్తంగా ఇదో బలమైన కథతో రూపొందిన సినిమాలా కనిపిస్తోంది. కాకపోతే థియేటర్స్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే వినోదం కూడా ఉంటే విజయమూ వస్తుంది. 

Full View

Tags:    

Similar News