DCM : థియేటర్స్ బంద్ పై టాలీవుడ్ కి పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్

Update: 2025-05-24 12:15 GMT

తెలుగు నాట సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను బంద్ చేయబోతున్నారు అనే వార్త సంచలనం అయింది. ప్రస్తుతం ఆ బంద్ వ్యవహారం సద్దుమణిగింది. ఈ నెలాఖరున మరోసారి చర్చలు జరిపిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల కొన్నాళ్ల వరకూ బంద్ నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే ఈ వ్యవహారంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది కాబట్టి, ఆ సినిమాను ఇబ్బంది పెట్టాలనే కారణంతోనే బంద్ చేయాలని ప్రయత్నించారు అని వారు ఆరోపించారు. ఇన్ని రోజులు కాస్త కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఉప ముఖ్యమంత్రి కార్యాలయం’పేరుతో ఒక సంచలన ప్రకటన విడుదల చేశాడు. అందులో మొదటి లైన్ చూస్తే.. తెలుగు సినిమా పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అని ఉంది. అంటే..అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యేడాదిలో అనేక సార్లు పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైనా ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్ స్వయంగా కల్పించుకున్నాడు. అయినా తన సినిమాను ఇబ్బంది పెట్టాలని చూశారు కాబట్టి ‘రిటర్న్ గిఫ్ట్’అనే పదం వాడారేమో.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని నిలదీశారు. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని, అగ్ర నటులను ఎలా ఛీత్కరించుకుందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. అలాగే ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు... సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు... సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది.. అని తేల్చి చెప్పారు.

థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తూ.. పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారు. ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్న వ్యవహారాలతోపాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారు.థియేటర్లను సంబంధిత యజమానులు నడపటం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా? వివిధ చిత్రాలకు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అని కూడా పన్నుల విభాగం పరిశీలన చేయాలని దిశానిర్దేశం చేశారు.

మొత్తంగా థియేటర్ల బంద్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందన కోసం చూస్తున్న సినిమా ఇండస్ట్రీకి ఆయన స్వీట్ వార్నింగే ఇచ్చాడని చెప్పొచ్చు. ఇప్పటి వరకూ తనను వ్యక్తిగతంగా కలిసి లబ్ధి పొందినవాళ్లంతా ఇప్పుడు తన సినిమానే టార్గెట్ చేయడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారనేది తెలిసిపోతోంది. మరోవైపు ఇండస్ట్రీ ఇష్యూస్ ను ఇకపై సంఘాలుగా వస్తేనే పరిష్కరిస్తా అని చెప్పడం ద్వారా.. వ్యక్తిగత లాబీయింగ్ చోటు లేదు అని తేల్చివేశాడు. థియేటర్ల ఆదాయం, ట్యాక్స్ ల గురించి ఆరా తీయడం అంటే సినిమా ఓనర్స్ ను కాకుండా లీజు దారులను టార్గెట్ చేసినట్టుగానే భావించాలి.

ఏదేమైనా పవన్ కళ్యాణ్ నుంచి ఎవరూ ఊహించని రీతిలో సంచలన స్పందన వచ్చింది. మరి దీనికి టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

Tags:    

Similar News