ఒక స్టార్ హీరో రేంజ్ తెలియాలంటే అతని మూవీకి వచ్చే ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్స్ చూస్తారు. ఆ విషయంలో ఎవరు తోపులు అనిపించుకుంటే వారే ఆ స్థాయి హీరోలతో పోటీలో నిలబడతారు. వీరందరినీ ఒక లైన్ లో పెడతాం. అదే హీరోయిన్ల రేంజ్ తెలియాలంటే హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా వారి చేతిలో ఎన్ని సినిమాలున్నాయో చూస్తే సరిపోతుంది. చేతిలో ఎన్ని ఎక్కువ సినిమాలుంటే వారికి అంత క్రేజ్ ఉన్నట్టు.. వారి రేంజ్ మరో స్థాయిలో ఉన్నట్టు. అలా చూస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ అనేయొచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్నీ తన సినిమాలే ఉన్నాయి. యస్ రాబోయే రోజుల్లో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇందులో రెండు సినిమాల్లో తనే మెయిన్ లీడ్.
పుష్ప 2 .. త్వరలో విడుదల కాబోతోన్న రష్మిక మందన్నా సినిమా. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ నుంచి మొదలైతే.. ఆ తర్వాత బాలీవుడ్ లో విక్కీ కౌశల సరసన నటించిన ఛావా సినిమా కూడా ఉంది. ఇది సంక్రాంతి రేస్ లో విడుదల కాబోతోంది. మరాఠా హీరో శంభాజీ మహరాజ్ కథగా వస్తోన్న ఛావా లో రష్మిక మందన్నా పాత్రలకు చాలా ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుందని తెలుస్తోంది.
తను మెయిన్ లీడ్ లో నటిస్తోన్న సినిమా ‘గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ప్రామిసింగ్ గా కనిపిస్తోందంటున్నారు. రష్మిక కెరీర్ లో ఓ మెమరబుల్ మూవీగా నిలుస్తుందనే టాక్ ఉంది. దీంతో పాటు రెయిన్ బో అనే మరో మూవీలో కూడా తనే మెయిన్ లీడ్. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ బాధ్యత తనదే. అప్పుడు తనెంత స్టార్ అనేది క్లియర్ గా తెలుస్తుంది.
అలాగే బాలీవుడ్ నుంచి మోస్ట్ ప్రామిసింగ్ మూవీగా సల్మాన్ ఖాన్ సికందర్ ఉండబోతోంది. కమర్షియల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న సికందర్ సల్మాన్ కూ కీలకంగా ఉంది. ఇందులో రష్మికది కేవలం రెగ్యులర్ హీరోయిన్ లా కాక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందంటున్నారు. ఈచిత్రం వచ్చే ఈద్ కు విడుదలవుతుంది.
ఇక తన నటనకు పరీక్ష పెట్టబోతోన్న మరో సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 15న టీజర్ విడుదల కాబోతోంది. ఆల్రెడీ రష్మిక బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే కుబేరలో ఆమె పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని తెలిసిపోయింది. తను ధనుష్ కు జంటగా నటిస్తోందా లేక ఇండివిడ్యువల్ పాత్రగా ఉంటుందా అనేది టీజర్ చూస్తే కొంత క్లారిటీ వస్తుంది. కుబేర 2025 ఫస్ట్ క్వార్టర్లీలో విడుదల కాబోతోంది.
ఇలా మొత్తం తన ఖాతాలో 6 సినిమాలు విడుదలకు ఉన్నాయి. ఎలా చూసినా ఇవన్నీ ప్రామిసింగ్ మూవీస్ గానే కనిపిస్తున్నాయి. అన్నీ హిట్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఆ ఆశ్చర్యాన్ని ఆడియన్స్ కు ఇస్తే రష్మికమందన్నా నిజంగానే నేషనల్ లెవల్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా మారుతుందని చెప్పొచ్చు.