రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మూవీ ఈ యేడాది కూడా విడుదల కావడం లేదా.. డిసెంబర్ 5న అని చెప్పిన రిలీజ్ డేట్ నుంచి పోస్ట్ పోన్ అవుతున్నారా అంటే.. అవుననే వినిపిస్తోంది. ఇంకా చెబితే అభిమానులతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా కోరుకుంటున్న కొత్త డేట్ కు వెళ్లడం దాదాపు ఖాయం అయినట్టే అనీ అంటున్నారు. మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న రాజా సాబ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వాళ్లు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ తో పక్కా ఎంటర్టైనర్మెంట్ గ్యారెంటీ అనిపించుకుంది. కొత్త తరహా హారర్ కామెడీతో వస్తున్నారని అర్థం అయింది.
ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీని ఈ యేడాది ఏప్రిల్ లోనే విడుదల చేస్తాం అని గతేడాదే ప్రకటించారు. బట్ సాధ్యం కాలేదు. దీంతో దసరా బరిలో ఉంటుందని భావించారు. ఆ డేట్ ను కూడా వదులుకున్నారు. తర్వాత వాళ్లే డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. బట్ ఈ డేట్ నుంచి కూడా తప్పుకుంటున్నారట. అంతా ఆశించినట్టు రాజా సాబ్ సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు అని ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అంటున్నారు.
2026 జనవరి 9న రాజా సాబ్ ను విడుదల చేయబోతున్నారు అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే రోజున తమిళ్ టాప్ స్టార్ దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ కూడా విడుదల డేట్ ఫిక్స్ చేసుకుంది. తెలుగులో ప్రాబ్లమ్ లేకపోయినా విజయ్ కి తమిళ్ లో తిరుగులేని మార్కెట్ ఉంది. కేరళ, కర్ణాటకలో రికార్డులున్నాయి. సో.. పోటీ బలంగానే ఉంటుంది. విశేషం ఏంటంటే.. ఇప్పుడు రాజా సాబ్ డేట్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న అఖండ 2 ను విడుదల చేయాలనుకుంటున్నారు. అందుకు కారణం రాజా సాబ్ పోస్ట్ పోన్ అనే విషయం వారికి క్లియర్ గా అర్థం కావడమే అంటున్నారు. సో.. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంకా నిరీక్షణ తప్పదు.