సినీరంగుల తెర చాటున రాక్షస చర్యలు అనేకం. మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుచెప్పుకుంటున్నారు. ఈ అంశంపై హీరోయిన్ సమంత స్పందించింది. “కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును చాలా ఏండ్లుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో చిక్కులు, ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరప్రదమైన పని ప్రదేశాలు మహిళల కనీస అవసరాల కోసం ఇప్పటికీ చాలా మంది పోరాటం చేస్తూనే ఉన్నారు. వారి ప్రయత్నాలు ఫలించడంలేదు. ఇప్పటికైనా ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ లో ఉన్న నా స్నేహితులకు, సోదరీమణులకు కృతజ్ఞతలు” అంటూ సమంత తన ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నారు.