పుష్ప 2.. దాదాపు రెండు నెలలకు పైగా దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ నోళ్లలో నానిన పేరు. టాలీవుడ్ నుంచి బాహుబలి 2 స్థాయిలో ప్యాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ ఇది. ప్రభాస్ తర్వాత అల్లు అర్జునే అనేలా చేసింది. అటు ఓటిటిలో సైతం బిగ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వారాల తరబడి టాప్ ఫైవ్ లో నిలిచింది. అలాంటి మూవీకి బుల్లితెరపై షాక్ తగిలింది. రీసెంట్ గా ఈ మూవీ టివిలో ప్రసారమైంది. రేటింగ్స్ పరంగా ఇప్పటి వరకూ టివిల్లో టాప్ ప్లేస్ అల్లు అర్జున్ దే. అల వైకుంఠపురములో చిత్రం ఏకంగా 29.4 టీఆర్పీ సాధించింది. ఈ రేటింగ్ ను పుష్ప 2 దాటేస్తుందని భావించారు చాలామంది. ఈ రేటింగ్ కాదు కదా కనీసం పుష్ప 1 రికార్డ్ ను కూడా దాటలేకపోయిందీ మూవీ.
పుష్ప 2 ఈ నెల 13న స్టార్ మాలో ప్రసారమైంది. అయితే కేవలం 12. 61 టీఆర్పీ మాత్రమే సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ఆల్రెడీ థియేటర్స్ లోనూ ఓటిటిల్లోనూ విపరీతంగా చూడటం వల్ల ఇలా జరిగిందా అంటే పుష్ప 1, అల వైకుంఠపురములో కూడా అంతే కదా అనే ప్రశ్నలు వస్తాయి. ఇక పుష్ప 1 కు 22.54 టీఆర్పీ వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే పుష్ప 2 దువ్వాడ జగన్నాథమ్ ను కూడా దాటలేకపోయింది. దువ్వాడ జగన్నాథమ్ చిత్రానికి 21.7 రేటింగ్ వచ్చింది. సో పుష్ప 2కు ఇంత హైప్ ఉన్నా.. అది టివిలకు పనిచేయలేదు అన్నమాట.