కొన్ని పాటలు సినిమాలకే హైలెట్ గా నిలుస్తాయి. కోట్లు ఖర్చు పెట్టినా రానంత పబ్లిసిటీని తెస్తాయి. అలాంటివి అరుదుగా ఉంటాయి. అలాంటిదే ఆ మధ్య రజినీకాంత్ జైలర్ సినిమాలో వచ్చిన నువ్వు కావాలయ్యా అనే పాట. ఆ పాటతో పాటు తమన్నా సోయగాలు హైలెట్ గా నిలిచాయి. ఇక తన స్టెప్పుల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. డ్యాన్స్ అంటే తమన్నా ఏ రేంజ్ లో ఎఫర్ట్ పెడుతుందో అందరికీ తెలుసు. నువ్వు కావాలయ్యా అనే పాట ఎల్లలు దాటి భాషతో పనిలేకుండా కోట్లాదిమందిని ఊపేసింది. సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చింది. ఆ పాట తర్వాత చాలామంది ఆ తరహా సాంగ్స్ తో ప్రమోషన్స్ కొట్టేయాలని ప్రయత్నించారు. కానీ కొందరు సక్సెస్ అయ్యారు. అయినా నువ్వు కావాలయ్యాను మాత్రం బీట్ చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు అదే సంగీత దర్శకుడు, అదే హీరో సినిమా కోసం మోనికా అంటూ వచ్చాడు. ఈ సారి మోనిక పూజాహెగ్డే.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన కూలీ సినిమా కోసం మరో స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశాడు అనిరుధ్ రవి చంద్రన్. 'మోనికా బెల్లూచీ ఎగిరే వచ్చింది.. కడలే కదం తొక్కే సునామీ తెచ్చింది.. మోనికా బెల్లూచీ తగ్గదీ ఎనర్జీ.. అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడి.. ' అంటూ సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్ రాయగా.. సుభలాషిని, అనిరుధ్ పాడారు. ఈ పాటలోనూ కావాల్సినంత ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీకి తగ్గ స్టెప్పులూ కుదిరాయి. అయితే ఈ సారి రజినీ కాంత్ మిస్ అయ్యాడు. మళయాల నటుడు సౌబిర్ షబీన్ కూడా అదిరిపోయే స్టెప్పులతో ఆశ్చర్యపరిచాడు. మొత్తంగా మోనికా పాటను నువ్వు కావాలయ్యాతో కంపేర్ చేస్తున్నారు చాలామంది. బట్ జైలర్ సాంగ్ లో ఉన్నంత వైబ్ ఈ పాటలో ఉందా అంటే లేదు అనే చెప్పాలి.