Film Chamber : రేపటి నుంచి సినిమా షూటింగులు బంద్..

Film Chamber : రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ బంద్‌ కానున్నాయి.

Update: 2022-07-31 13:15 GMT

Film Chamber : రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్స్‌ బంద్‌ కానున్నాయి. గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు తెలిపింది. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలకు.. పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్‌ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభిస్తామో త్వరలో చెబుతామని వెల్లడించారు నిర్మాత దిల్‌రాజు.

టాలీవుడ్‌ ట్రబుల్స్‌లో పడింది. సోమవారం నుంచి సినిమా షూటింగులు ఆగిపోతున్నాయి. ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు బంద్‌ చేయాలన్న గిల్డ్‌ నిర్ణయానికి.... ఫిలిం చాంబర్‌ సైతం మద్దతు తెలిపింది. ఈ మేరకు ఫిలిం చాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిర్మాతలు అందరూ కలసి ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ బంద్‌ చేయాలని నిర్ణయించారు.చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ... సినిమా షూటింగ్‌లు కొన్ని రోజులు ఆపాలని నిర్ణయించినట్లు తెలుగు ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడు బసిరెడ్డి తెలిపారు.

పరిష్కారం దొరికే వరకూ షూటింగ్‌లను తిరిగి మొదలు పెట్టబోమన్నారు నిర్మాత దిల్‌ రాజు. అందరం కూర్చొని మాట్లాడుకుంటామన్నారాయన. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయని... రన్నింగ్ లో ఉన్న సినిమా షూటింగ్ లు సైతం బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. అన్నీ సమస్యలను పరిష్కరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తామన్నారు నిర్మాత దిల్ రాజు .

కొత్త సినిమాలే కాదు, చివరి దశలో ఉన్న చిత్రాల షూటింగ్‌లు సైతం నిలిపేస్తున్నారు.ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎవరూ సంతోషంగా లేరని ఫిలిం చాంబర్‌ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసి, చిత్ర పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు ఏం చేయాలన్నది త్వరలో చర్చిస్తామంటున్నారు.

ఈ క్రమంలోనే 24 విభాగాల వారితోనూ చర్చలు జరుపుతామని పేర్కొంది. అయితే.. ఇప్పటికే ఔట్‌డోర్‌లో జరుగుతున్న షూటింగ్‌లు ఆపబోమన్నారు సి కల్యాణ్‌. షూటింగ్‌ల నిలిపివేతల నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. ప్రొడ్యూసర్‌ కౌన్సిన్‌లు సంప్రదించాలన్నారాయన.

కరోనా కారణంగా టాలీవుడ్‌కు కష్టాలొచ్చాయి. ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లో రెండు మూడు వారాలకే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక .. స్టార్ హీరోల రెమ్యూనరేషన్, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ సైతం హద్దులు దాటుతోంది.

సినిమా బడ్జెట్ కూడా నిర్మాతలు కంట్రోల్ చేయలేని విధంగా పరిస్థితులు మారాయి. దీంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కారం కనుక్కునేందుకు ప్రస్తుతం షూటింగ్‌లు బంద్‌ చేస్తున్నారు. అయితే.. ఈ నిర్ణయం ఎంత వరకు సక్సెస్‌ అవుతుందన్నది చూడాలి. 

Similar News