స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా ‘తెలుసు కదా’.కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన ఈ చిత్రంతో దర్శకురాలుగా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ అంటూ ఇప్పటి వరకూ చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఆ ట్రైయాంగిల్ స్టోరీస్ లో తెలుసు కదా కాస్త భిన్నంగా ఉండబోతోందా అనిపించేలా ఉంది టీజర్. హీరో ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం.. ఆ ఇద్దరూ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ కావడం.. ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేయడం.. వారితో రొమాన్స్ ఇలా కనిపిస్తోంది టీజర్. చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
సిద్ధు పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ డిజే టిల్లు గుర్తొస్తుంది. ఆ ఇమేజ్ కారణంగానే అతని లాస్ట్ మూవీ జాక్ ఫ్లాప్ అయింది. బట్ ఆ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు అనేలా ఉంది. చాలా సింపుల్ గా, లౌడ్ గా లేని డైలాగ్ డెలివరీతో కనిపిస్తున్నాడు. అటు శ్రీనిధి శెట్టి, రాశిఖన్నాతో రొమాన్స్ కూడా మంచి కెమిస్ట్రీతో కనిపిస్తోంది. వీరికి తోడు హర్ష పాత్ర సినిమాలో నవ్వులు పంచబోతోందనిపించేలా ఉంది. అందుకే అతను ఆ ఇద్దరి గురించి అతనికి చెప్పినప్పుడు.. ‘నీకు ఇష్టమే కదా.. ఇలా ఇద్దరిద్దరి మధ్యలో దూరిపోవడం’అనే డైలాగ్ కనిపిస్తుంది. అలాగే అతని మైండ్ లో ఉన్నది పసిగట్టినట్టుగా హర్ష చెప్పే ‘అసలేం నడుస్తుందా నీ మైండ్ లో’ అనే డైలాగ్ సైతం ఇంప్రెసివ్ గా అనిపిస్తోంది.
మొత్తంగా నీరజా కోన ఓ ఫ్రెష్ కంటెంట్ తోనే దర్శకురాలుగా పరిచయం అవుతుందేమో అనిపించేలా ఉంది ఈ టీజర్. మరి ఎంత ఫ్రెష్ గా ఉంటుందనేది అక్టోబర్ 17న తెలిసిపోతుంది. సినిమా రిలీజ్ డేట్ అదే.