రివ్యూ : తండేల్
తారాగణం : నాగ చైతన్య, సాయి పల్లవి, ఆడుకాలం నరేన్, కరుణాకరన్, దివ్యా పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, ప్రకాష్ బెలవాడి తదితరులు
ఎడిటర్ : నవీన్ నూలి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ సైనుద్దీన్
నిర్మాత : బన్నీ వాసు
దర్శకత్వం : చందు మొండేటి
కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే అంచనాలు పెరుగుతాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో అలాంటిదే. ఇక చందు మొండేటితో ఆల్రెడీ ప్రేమమ్ వంటి బ్లాక్ బస్టర్ చూసి ఉన్నాడు చైతూ. ఈ హిట్ కాంబోలో అనౌన్స్ అయిన తండేల్ ముందు నుంచీ క్రేజీ ప్రాజెక్ట్ గానే ఉంది. పైగా రియల్ స్టోరీ. దీనికి తోడు ఫస్ట్ లుక్ నుంచే చైతన్య ఆకట్టుకున్నాడు. భారీ బడ్జెట్ తో పాటు విపరీతమైన ప్రమోషన్స్ తో అంచనాలు పెంచిన తండేల్ ఎలా ఉందో చూద్దాం.
కథ :
శ్రీకాకుళం జిల్లాలోని మత్సకార కుటుంబాలు కొన్ని చేపల వేట కోసం గుజరాత్ కు వెళ్లి అక్కడ ఏడాదికి 9 నెలల పాటు పని చేసి సంపాదించుకు వస్తారు. అలా కొన్ని సంఘటనల తర్వాత ఆ ముఠాకు తండేల్ (నాయకుడు) గా నియమించబడతాడు రాజు(నాగ చైతన్య). రాజు చిన్నప్పటి నుంచి సత్య(సాయి పల్లవి)ని ప్రేమిస్తుంటాడు. వీరిది గాఢమైన ప్రేమ. ఓ సంఘటన చూసిన తర్వాత రాజు చేపల వేటకు వెళ్లడం సత్యకు ఇష్టం ఉండదు. అయినా తను తండేల్ కాబట్టి వెళ్లాల్సిందే అని ఆమెకు నచ్చకున్నా వెళతాడు. అలా ఓ తుఫాన్ లో చిక్కుకుని తెలియకుండానే పాక్ జలాల్లోకి ప్రవేశిస్తారు. వీరిని పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తుంది. మరి వీళ్లు తిరిగి ఎలా వచ్చారు..? సత్య తనను కాదని వెళ్లిన రాజుపై కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది..? వారిని రప్పించేందుకు ఎవరెవరు ఎలాంటి కృషి చేశారు అనేది మిగతా సినిమా.
ఎలా ఉంది :
తండేల్ టైటిల్ లోనే ఓ సహజత్వం ఉంది. చేపల వేటకు వెళ్లే షిప్ ను నడిపేవారిని తండేల్ అంటారు. వీళ్లు సినిమా కోసం దాన్ని నాయకుడుగా మార్చుకున్నారు. అందుకు తగ్గ సన్నివేశాలు సెట్ చేసుకోవడంలో టైటిల్ కూడా యాప్ట్ అయిపోయింది. ఇక ఈ కథలో జాలరులు పాకిస్తాన్ జైలులో బంధించ బడ్డారు కాబట్టి ఆ కోణంలో కథను ఎక్స్ పెక్ట్ చేస్తే రాంగ్ అయిపోతారు. ఇది ప్రధానంగా ప్రేమకథ. రాజు, సత్యల ప్రేమకథ. ఆ కథలో వీరికి ఏ అడ్డంకీ ఉండదు. ఎవరూ ప్రేమకు ఎదురు చెప్పరు. అయితే జాలరి జీవితం గురించి ఓ డైలాగ్ ఉంటుందీ సినిమా. ‘ఎవరైనా చావు వస్తే చస్తారు.. కానీ వీళ్లు మాత్రమే చావుకు ఎదురెళ్లి చస్తారు’అని. అది నిజం. సముద్రంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అలా ఓ జాలరి తన పడవ తిరగబడి చనిపోతాడు. అలా తన రాజు కూడా అయిపోతాడేమో అని భయపడ్డ సత్య అతన్ని వేటకు వెళ్లొద్దు అంటుంది. అప్పటికే తండేల్ గా మారిన రాజు తనను నమ్ముకుని 21 కుటుంబాలున్నాయని ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటాడు. అది నచ్చని ఆమె ఇప్పుడు వెళితే ‘నా నుంచి శాశ్వతంగా వెళ్లినట్టే’ అంటుంది. రాజు వెళతాడు. సత్య వేరే పెళ్లికి సిద్ధం అవుతుంది. అటు రాజు పాకిస్తాన్ జైలులో ఉంటాడు. మరి వీరి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనే కోణంలోనే కథనం ఎక్కువగా సాగుతుంది. ఇంత వరకూ ఓకే అనిపిస్తుంది. ప్రేమకథకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అన్ని దశల్లోనూ.. అంటే ఆనందం, ఆవేదన, బాధ, కోపం, ఎడబాటు, విరహం.. ఇలా అన్ని ఎమోషన్స్ కూ అద్భుతమైన ‘సిగ్నేచర్ ట్యూన్స్’ ఇచ్చాడు దేవీ శ్రీ ప్రసాద్. ఈ మధ్య కాలంలో ఇదే అతని బెస్ట్ వర్క్ అని కూడా చెప్పొచ్చు.
కాకపోతే పాకిస్తాన్ ఎపిసోడ్ మాత్రం చాలా వరకూ తేలిపోయింది. జైలులో పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన లేకుండానే దర్శకుడు చిత్రీకరించినట్టుగా ఉంది. ముఖ్యంగా దేశభక్తి కోసం రాసుకున్న సీన్స్ చాలా ఆర్టిఫిషియల్ గానూ అవుట్ డేటెడ్ గానూ ఉన్నాయి. ఆ సీన్స్ అన్నీ ఫోర్స్ డ్ గానే ఉంటాయి తప్ప చూసే ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలించేలా కనిపించవు. ఈ విషయంలో దర్శకుడి ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇక అంతమంది అరెస్ట్ అయినప్పుడు మరో విషయమే లేదన్నట్టు కేవలం ప్రేమకథ, ప్రేమికులపైనే ఫోకస్ చేయడం వల్ల మిగతా పాత్రలన్నీ జూనియర్ ఆర్టిస్టుల్లా మారిపోయారు. కనీసం దివ్యా పిళ్లై భర్త నుంచి కూడా ఎలాంటి ఎమోషన్ లేకుండా రాసుకున్నారు.
అయితే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా రాజును విడిపించేందుకు సత్య చేసిన పోరాటం స్ఫూర్తివంతంగా కనిపిస్తుంది. అందుకోసం తనను పెళ్లి చేసుకునే వ్యక్తి సాయమే తీసుకోవడం అతనూ ‘సత్యను నేను పెళ్లి చేసుకోవడం కాదు.. సత్య నన్ను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్’ అని భావించడం వల్ల సహజంగా ఉంది. ఆ పాత్ర చేసిన తమిళ నటుడు కరుణాకరన్ కరెక్ట్ గా సరిపోయాడు.
ఇసుక ర్యాంప్ ఫైట్ అస్సలు సెట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా బాలేదు. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే తుఫాన్ సీక్వెన్స గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తండేల్ గా ఓ పాకిస్తాన్ వాడు ప్రమాదంలో ఉన్నా కాపాడేందుకు వెళ్లడం ఆ క్రమంలో చేసిన సాహసాలు అన్నీ కళ్లప్పగించి చూసేలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో మళ్లీ అలాంటి ఇంటెన్సిటీ కనిపించదు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎమోషన్స్ బాగా పండాయి. ఇటు సాయి పల్లవి కళ్లతోనే కన్నీళ్లు తెప్పిస్తే .. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎమోషన్ కు గురి చేశాడు. కథ సుఖాంతం అవుతుందని అంతా ఊహించేదే అయినా.. ఆ ఫినిషింగ్ టచ్ బావుంది.
నటన పరంగా నాగ చైతన్య ఎక్కడా తను అక్కినేని వారబ్బాయి అని భావించలేదు. పూర్తిగా తండేల్ రాజుగా మారిపోయాడు. ఆ పాత్రను తను ఓన్ చేసుకున్నాడా అనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ నుంచి డిక్షన్ వరకూ ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా అద్భుతంగా నటించాడు. ఇక సాయి పల్లవి గురించి చెప్పేదేముందీ. ఫిదాలో భానుమతిలా తండేల్ లో సత్య అయిపోయింది. ఏ పాత్ర చేసిన ఆ పాత్రకే వన్నె తేవడం సాయిపల్లవికే చెల్లుతుంది. ఇది తన కెరీర్ లో మరో బెస్ట్ రోల్. సాయి పల్లవి తండ్రి పాత్రలో పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు. ఆడుకాలం నరేన్ ఓకే. మైమ్ గోపిని ఒక్క సీన్ కే పరిమితం చేయడం బాలేదు. దివ్యా పిళ్లై చాలా సహజంగా నటించింది. మిగతా పాత్రలన్నీ సహజంగా కనిపించాయి.
టెక్నికల్ గా ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమే హైలెట్. ప్రేమకథలకు దేవీ ఎంచుకునే ట్యూనింగ్ భలే అనిపిస్తుంది. ఈ మూవీలో చాలా యేళ్ల తర్వాత సిగ్నేచర్ ట్యూన్స్ వింటాం. ఒకే ట్యూన్ ను రకరకాల ఎమోషన్స్ కు తగ్గట్టుగా వినిపించడం బలే అనిపిస్తుంది. పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్. సినిమాలో ఇంకా బావున్నాయి. సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ఎడిటింగ్ బావుంది. డైలాగ్స్ లో డెప్త్ లేకున్నా.. ఈ కథకు సరిపోయేలా ఉన్నాయి. కాస్ట్యూమ్స్, ఆర్ట్ వర్క్, సెట్స్ ముఖ్యంగా పాకిస్తాన్ జైలు సెట్ బావుంది. నిర్మాణ విలవలు బావున్నాయి. దర్శకుడుగా చందు మొండేటి ఒరిజినల్ కథనే ఎంచుకున్నా.. ఆ కథలో ప్రేమకథకు ఎక్కువ స్పేస్ ఇచ్చాడు. ఈ లవ్ ఎపిసోడ్స్ పై పెట్టిన శ్రద్ధ మిగతా ఎపిసోడ్స్ పై కనిపించదు. జైలు ఎపిసోడ్స్ అన్నీ వెరీ ఆర్టిఫిషియల్. దర్శకుడుగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న చందు ఈ కథ విషయంలో అనేకసార్లు తడబడ్డాడు అనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
నాగ చైతన్య
సాయి పల్లవిల నటన
సంగీతం
సినిమాటోగ్రఫీ
ప్రీ ఇంటర్వెల్
ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
అక్కడక్కడా స్లోగా సాగే కథనం
ఎమోషన్స్ పండకపోవడం
పాక్ ఎపిసోడ్ లో డెప్త్ లేకపోవడం
ఫైట్స్
ఫైనల్ గా : దుల్లగొట్టేసేలానే ఉన్నారు
రేటింగ్ : 3/5
బాబురావు. కామళ్ల