అందరూ చూస్తే స్నేహితులు.. ‘అందర్’చూస్తే శతృవులు అన్నట్టుగా ఉన్నారీ ఇద్దరు స్టార్స్. ప్రస్తుతం వీరి వైరం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. మామూలుగా అయితే ఇద్దరూ నందమూరి క్యాంప్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తారు. చిరంజీవి అడిగితే టాలీవుడే ఒక క్యాంప్ అని చెబుతారు. ఇద్దరూ కలిసి బాలయ్య ఫంక్షన్స్ లో చిందేస్తారు. ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేశారు. అయినా తమ సినిమాల విడుదలప్పుడు శతృవుల్లా కనిపిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా వీరి రెండు సినిమాలు, రెండు రీ రిలీజ్ లు కనిపిస్తున్నాయి. అదే ఈ హాట్ టాపిక్ కు అసలు కారణమైంది.
ఆ ఇద్దరూ సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్. ఇద్దరూ స్వయంకృషితో ఎదుగుతున్నవాళ్లే. సిద్ధుకు లేట్ గా బ్రేక్ వచ్చింది. విశ్వక్ వచ్చిన బ్రేక్ ను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ లా కనిపిస్తారు. కానీ తమ సినిమాల రిలీజ్ రోజున తన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ కొత్త సినిమాలను దెబ్బ కొట్టాలని చూసుకుంటున్నారు అనేది టాలీవుడ్ లో వినిపిస్తోన్న మాట.
కొన్నాళ్ల క్రితం విశ్వక్ సేన్ ‘లైలా’ అనే మూవీతో వచ్చాడు. అదే రోజున సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాన్ని టైటిల్ మార్చి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’అనే పేరుతో విడుదల చేశారు. కట్ చేస్తే లైలా బిగ్ డిజాస్టర్ అయింది. కాంప్లికేటెడ్ ను ఎవరూ పట్టించుకోలేదు. అయినా తన సినిమా రిలీజ్ రోజున అతను రీ రిలీజ్ చేశాడు అనే పాయింట్ ను మనసులో పెట్టుకున్నాడు లైలా హీరో.
ఇక ఇప్పుడు సిద్ధు నటించిన ‘జాక్’ ఈ నెల 10న విడుదలవుతోంది. దీంతో అదే రోజున విశ్వక్ కు బ్రేక్ ఇచ్చిన ఫలక్ నుమా దాస్ ను రీ రిలీజ్ చేస్తున్నాడు. ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనేది పక్కన పెడితే ఇద్దరూ కావాలనే చేసుకుంటున్నారు అనేది ఓపెన్ గా వినిపిస్తోన్న విషయం. మరి ఈ పంచాయితీ నిజంగా ఉంటే ఆ బాలయ్యే బరిలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలి.. కనీసం ఎన్టీఆర్ అయినా.. రావాలి. లేదంటే ఇద్దరూ నష్టపోతారు.