ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సీనియర్ హీరోలే దూకుడుగా ఉన్నారు. చాలా వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్నారు. వాళ్లు తమ కెరీర్ ఆరంభంలో ఎంత స్పీడ్ గా ఉన్నారో ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నారు. మోహన్ లాల్, మమ్మూట్టి, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ ఇలా చెప్పుకుంటూ ఈ తరం హీరోలంతా దూకుడు చూపిస్తున్నారు. అయితే ఈ దూకుడుకు ఆద్యుడు మాత్రం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. వయసయింది కదా అని రెస్ట్ తీసుకోకుండా ఇంకా ఎక్కువ పని చేశాడు. అదే ఈ హీరోలందరికీ ఆయనే చెప్పాడు. వీళ్లంతా అది ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.
విక్రమ్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు లోక నాయకుడు కమల్ హాసన్. తర్వాత కల్కిలో మెరిశాడు. భారతీయుడు 2 పోయినా.. ఇప్పుడు థగ్ లైఫ్ తో వస్తున్నాడు. 35యేళ్ల తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో చేస్తోన్న సినిమా కావడం విశేషం. వీరి కాంబోలో అప్పట్లో క్షత్రియ పుత్రుడు, నాయకుడు వంటి క్లాసిక్స్ వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని కమల్, మణిరత్నం ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అయిపోయిందంటూ ప్రకటించింది టీమ్. ఈ వయసులో ఇంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేయడం అంటే ఇద్దరికీ సవాలే. అయినా సినిమా అంటే చాలా ప్యాషన్ ఉన్నవాళ్లు కాబట్టే.. త్రిష, శింబు, పంకజ్ త్రిపాఠి, జోజూ జార్జ్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జిషుసేన్ గుప్తా లాంటి భారీ తారాగణం ఉన్నా అనుకున్న టైమ్ లోనే పూర్తి చేశారు. మరి ఈ మూవీని నవంబర్ లో విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారని టాక్. మొత్తంగా కమల్, మణిరత్నం కాంబోలో అంటే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవల్ లో ఉంటాయి.