లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్ లైఫ్ ట్రైలర్ విడులైంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయబోతున్నారు. 35యేళ్ల తర్వాత కమల్, మణి కాంబోలో వస్తోన్న సినిమా ఇది. అందుకే ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. కమల్ తో పాటు శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోకన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన థగ్ లైఫ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను త్రిబుల్ చేసింది అనే చెప్పాలి.
రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే ఓ గ్యాంగ్ స్టర్.. అతను ఓ అపాయంలో ఉన్నప్పుడు అమర్ అనే చిన్న కుర్రాడు కాపాడతాడు. ఎవరూ లేని ఆ కుర్రాడిని తనే పెంచుతాడు. పెరిగి పెద్దయిన ఆ కుర్రాడు శక్తివేల్ కు రైట్ హ్యాండ్ గా ఉంటాడు. ఓ దశ దాటిన తర్వాత శక్తివేల్ కు ఎదురు తిరుగుతాడు. అతని ప్లేస్ లో తను ఉండాలని తెగిస్తాడు. దీంతో ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలై సమరం వరకూ వెళుతుంది. ఇదీ ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఓ రకంగా సినిమా కథంతా చెప్పేశాడు ట్రైలర్ తో. కాకపోతే మణిరత్నం టేకింగ్, ఎమోషన్స్ ను డీల్ చేసే విధానం, యాక్షన్ సీక్వెన్స్ లు నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తున్నాయి. విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ ట్రైలర్ లో చూస్తుంటేనే విజువల్ ఫీస్ట్ లా అనిపిస్తోంది. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ట్రైలర్ లో డైలాగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
చిన్నప్పుడు తనను కాపాడిన కుర్రాడిని ఉద్దేశిస్తూ.. ‘నువ్వు నా ప్రాణం కాపాడినోడివి.. యముడికి దొరక్కుండా ఎనక్కు లాగినోడివి. నీ తలరాత నా తలరాత ఒకటిగా రాశాడాడు. ఇక మీద నువ్వు నేను ఒక్కటే.. చివరి వరకూ’.. అనే డైలాగ్ తో పాటు వచ్చిన హమ్మింగ్ అదిరిపోయింది. ‘నేను తాడిని తండే నువ్వు బోడిని తన్నేవాడివిరా’ అని కమల్ అంటే.. ‘నేను తలతన్నేవాడిని’ అని శింబు అనడం.. ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అభిరామితో ఈ వయసులో లిప్ లాక్ చేయడం.. త్రిష ఎంట్రీ అవగానే ‘నేనే నీ ఆడమ్’అని చెప్పడం అంతా అదిరిపోయింది.. ‘పవర్ మన ఇంటి తలుపు తట్టదు.. బద్ధలు కొట్టి తీసుకోవాలి..’అనే డైలాగ్ అసలు ఘర్షణకు మొదలు అనుకోవచ్చు.
ఇక చివర్లో .. అదే శింబును ఉద్దేశిస్తూ.. ‘ఇది యముడికి నాకూ జరిగే కథ.. నువ్వా నేనా..’ అని చెప్పడం అనే ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది. ఏదేమైనా ఈ మూవీ నెక్ట్స్ లెవల్లో ఉండబోతోందని ట్రైలర్ తో తేలిపోయింది. మణిరత్నం, కమల్ కాంబోపై ఉన్న అంచనాలను అందుకోవడమే కాదు.. మరోసారి ఓ బెస్ట్ మూవీ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వబోతోందని అర్థమవుతోంది. మరి సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ కు వెళుతుందో చూడాలి.