తండేల్ తర్వాత టాలీవుడ్ కు పెద్దగా ఊపునిచ్చే సినిమా రాలేదు. వాలెంటైన్స్ డే ఊరించినా ఉస్సూరుమంది. విశ్వక్ సేన్ లైలా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. మిగతావేవీ ఆకట్టుకోలేదు. దీంతో ఫిబ్రవరి 21న వచ్చే సినిమాలపై అందరి దృష్టీ పడింది. ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ మూవీస్ అయితే రెండు డబ్బింగ్ సినిమాలు. కానీ దేనికీ సరైన ప్రమోషన్ కనిపించడం లేదు. ఈ నాలుగూ ఆడియన్స్ ను థియేటర్స్ వరకూ రప్పించి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే సత్తా ఉన్నవిగా కనిపించడం లేదు.
తెలుగు నుంచి వస్తోన్న వాటిలో 21న బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాపు చిత్రం విడుదలవుతోంది. దయా ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. తెలంగాణ నేపథ్యంలో ఓ మంచి ఎమోషనల్ మూవీలా కనిపిస్తోంది. స్టార్ కాస్ట్ లేకపోవడంతో ఓపెనింగ్స్ పై అనుమానం కనిపిస్తోంది.
ఇక నటుడు ధన్ రాజ్ నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా రామం రాఘవం. సముద్రఖని, హరీష్ ఉత్తమన్, సత్య, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బావుంది. తండ్రి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఓ కొత్త కోణంలో రూపొందిన సినిమాలా కనిపిస్తోంది. ధన్ రాజ్ కు జబర్దస్ టీమ్ నుంచి సపోర్ట్ ఉంది. అది సినిమాకు ఏ మేరక ప్లస్ అవుతుందో చూడాలి.
వీటితో పాటు తమిళ్ నుంచి ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సినిమా వస్తోంది. పవిష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇందులో నటించిన వాళ్లెవరూ తెలుగు వారికి తెలియదు. ఇక్కడ ప్రమోషన్స్ కూడా లేవు. కేవలం ధనుష్ డైరెక్ట్ చేశాడు అని మాత్రమే చూసేవాళ్లున్నారా అనేది రిలీజ్ రోజున తేలుతుంది.
ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆకట్టుకున్న మరో తమిళ్ మూవీ రిటర్న్స్ ఆఫ్ డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్, కయాడు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకుడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. ట్రైలర్ బావుంది. మైత్రీ మూవీస్ వాళ్లు తెలుగులో విడుదల చేస్తున్నారు. థియేటర్స్ పరంగా ఇబ్బంది లేకపోవచ్చు కానీ.. ఓపెనింగ్స్ వస్తాయా అనేది పెద్ద ప్రశ్న.
మొత్తంగా ఈ నాలుగు సినిమాలు ఈ శుక్రవారం విడుదల కాబోతున్నాయి. మరి వీరిలో బాక్సాఫీస్ వద్ద హిట్ జెండా ఎగరేసేది ఎవరో చూడాలి.