యాయిరే యాయిరే అంటూ 90 ల్లో కుర్రకారును ఉర్రూతలూగించింది నటి ఊర్మిళ మటోండ్కర్. 1995 లో వచ్చిన రంగీలా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది ఊర్మిళ. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ఊర్మిళ తాజాగా మళ్లీ ఆ పాత రోజుల్ని గుర్తుచేశారు. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన 'రంగీలా' చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సినిమాలోని ఐకానిక్ పాటకు డాన్స్ చేసి మరోసారి అందరిని ఆకట్టుకున్నారు. చిన్న గౌను లో పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ...మూడు దశాబ్దాలైనా తనలో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించారు ఊర్మిళ. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రంగీలా సినిమా వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా.. ఊర్మిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. "రంగీలా కేవలం ఒక సినిమా కాదు, అదొక గొప్ప అనుభూతి. ప్రతి పాటా ఓ వేడుక. ముప్పై ఏళ్ల క్రితం మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ఈ సినిమా, ఈనాటికీ అదే శక్తితో ఆ మొదటి క్షణంలోకి తీసుకెళ్తుంది. కలలు కనే ధైర్యాన్నిచ్చి నన్ను ఆదరించిన మీ ప్రేమకు ధన్యవాదాలు" అని తన మనసులోని మాటలను పంచుకున్నారు.
1995లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా అప్పట్లో ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఊర్మిళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గానే నిలుస్తున్నాయి. ఊర్మిళ పోస్ట్ వైరల్ గా మారడంతో...ఆమె అభిమానులు, నెటిజన్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. 'రంగీలా ఎప్పటికీ ఒక క్లాసిక్' అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తానికి, 30 ఏళ్లయినా "రంగీలా" క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు