90స్ లో మోస్ట్ ఫేవరెట్ హీరో అనిపించుకున్నాడు వడ్డే నవీన్. ఆయన తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ నిర్మాత. తండ్రి వారసత్వంలో నిర్మాతగా కాక హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్.. మంచి విజయాలే అందుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ఇష్టమైన నటుడు అనిపించుకున్నాడు. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, మా ఆవిడమీద ఒట్టు మీ ఆవిడ చాలామంచిది వంటి మూవీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మారిన ట్రెండ్ లో కొత్తతరం హీరోలు రావడం.. అప్పటికే అతను యంగ్ హీరో స్టేజ్ దాటిపోవడం.. ఆపై మాస్ హీరోగా చేసిన కొన్ని ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. చివరగా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన అటాక్ అనే సినిమాలో కనిపించాడు.
ఆ మధ్య నటుడు అలీ నిర్వహించే ఒక షోకు వడ్డే నవీన్ ను గెస్ట్ గా పిలవమని వందల కొద్దీ కామెంట్స్ ఉండేవి. అలీ ప్రయత్నించినా.. నవీన్ రాను అని చెప్పేవాడట. ఫైనల్ గా ఆ షో కు కాదు కానీ.. నవీన్ హీరోగా మళ్లీ కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. అతను హీరోగా ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’అనే సినిమా రూపొందుతోంది. రాఖీ పండగ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ మూవీ నుంచి టైటిల్ తో పాటు పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికీ అదే ఫిట్ నెస్ మెయిన్టేన్ చేస్తూ కనిపిస్తోన్న నవీన్ ఈ మూవీలో ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తాడని ఈ పోస్టర్ తో అర్థం అవుతోంది.
నార్ల కమల్ తేజ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నాడు నవీన్. మామూలుగా కానిస్టేబుల్ త్రిమూర్తులు అంటే బావుంటుంది అనుకుంటారు. బట్ వీళ్లు ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు అని పెట్టారు. టైటిల్ ను బట్టి అతనికి ఎక్కువ ట్రాన్స్ ఫర్స్ అవుతాయని.. అందుకు నిజాయితీయే కారణం అవుతుందని వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా ఎంతోమంది ఎదురుచూస్తోన్న వడ్డే నవీన్ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధం అయ్యాడు. మరి ఈ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.