Varahi Vehicle: పవన్ ప్రచార రథం.. వారాహికి లైన్ క్లియర్

Varahi Vehicle: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రచారరథం వారాహికి లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రవాణా శాఖ ఆ వాహనానికి ఈ నెల 8వ తేదీన TS13 EX 8384 నంబర్‌ను కేటాయించింది.;

Update: 2022-12-13 07:00 GMT

Varahi Vehicle: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రచారరథం వారాహికి లైన్ క్లియర్ అయింది. తెలంగాణ రవాణా శాఖ ఆ వాహనానికి ఈ నెల 8వ తేదీన TS13 EX 8384 నంబర్‌ను కేటాయించింది. వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్‌ కేటాయించాలంటూ పవన్‌కల్యాణ్ ప్రతినిధులు రెండు వారాల క్రితం తమను సంప్రదించారని, వారి దరఖాస్తును పరిశీలించిన తర్వాత మోటార్‌ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని రవాణా శాఖ అధికారులు తెలిపారు.



అది కారవాన్‌ వాహనమని, కొన్ని సౌకర్యాల కోసం దానిలో మార్పుచేర్పులు చేశామంటూ బాడీ బిల్డింగ్ సంస్థ ధృవపత్రాన్ని సమర్పించిందని వివరించారు. వాహనం రంగు ఎమరాల్డ్‌ గ్రీన్‌ అని, వాహనానికి అన్ని పరీక్షలు చేసి సంతృప్తి చెందాకే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్ ఇచ్చామన్నారు. ఈ వెహికిల్‌లో దేశవ్యాప్తంగా ప్రయాణించొచ్చని చెప్పారు.


తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ సైతం వారాహిపై స్పందించారు. వారాహి రంగుపై అభ్యంతరం ఏం లేదన్నారు. భారత సైన్యం ఉపయోగించే రంగు కోడ్‌ 7 బీ 8165 అని, జనసేన ప్రచార రథం రంగు కోడ్‌ 445 సీ 44 అని క్లారిటీ ఇచ్చారు. జనసేన వెహికిల్ రంగు ఆలివ్‌ గ్రీన్ కాదన్నారు మంత్రి పువ్వాడ. అది ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడే వెహికిల్ ఉందన్నారు.


ఇక యుద్ధానికి సిద్ధమంటూ పవన్‌కల్యాణ్‌ వారాహి వాహనం ఫోటో, వీడియోలను ట్విట్టర్‌లో కొద్ది రోజుల క్రితం పోస్టు చేశారు. ఆర్మీ అధికారులు, సైనిక అవసరాలకు వినియోగించే వాహనాలకు మాత్రమే ఆకుపచ్చ రంగు ఉండాలని, ఇతరులు వినియోగించకూడదంటూ వైసీపీ నేతలు..కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తుండడంతో వెహికిల్ రిజిస్ట్రేషన్‌పై ఉత్కంఠ ఏర్పడింది. వారాహిని టాటా మోటార్స్ సంస్థ భారత్ స్టాండర్డ్స్‌-6 ప్రమాణాలతో తయారు చేసింది.

Tags:    

Similar News