ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన సినిమా వార్ 2. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. ఓ ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయలేకపోతోంది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ జరుగుతోంది. కానీ ఆశించినంత గొప్పగా ఉంటుందా అనే సందేహాలు కలిగించేలా ఉన్నాయి ఈ ప్రమోషనల్ స్ట్రాటజీస్. ఏదో ఒక బండిని హృతిక్ ఇంటి ముందు ఆపడం.. ఇది ఎన్టీఆర్ వార్నింగ్ అనడం.. ఆపై ఎన్టీఆర్ ఇంటి ముందు మరో బండి ఉంచడం.. ఇది హృతిక్ వార్నింగ్ అనడం.. ఇవన్నీ చూస్తుంటే ఏదో చిన్న హీరోల ప్రయత్నంలా ఉంది తప్ప పెద్ద హీరోల సినిమాల ప్రమోషన్ లా మాత్రం కనిపించడం లేదు అనేది చాలామంది భావన.
ఇక ఈ మూవీ హైలెట్స్ లో ఒకటి డ్యూయెట్ సాంగ్. ఇద్దరు హీరోలూ టాప్ డ్యాన్సర్స్. హృతిక్ డ్యాన్స్ లో గ్రేస్ ఉంటే.. ఎన్టీఆర్ డ్యాన్స్ లో గ్రేస్ తో పాటు మాస్ కూడా ఉంటుంది. అలాంటి ఇద్దరు కలిసి చేసే పాటంటే డ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తాం. అయితే ఇది కేవలం గ్రేస్ డ్యాన్స్ మాత్రమే అనేలా తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు. రేయి పగలు ఏదైన గానీ.. మనముంటే కాదా దివాలీ.. దునియా సలామే సలామ్ అనాలి .. అంటూ సాగే పాట ఇది. ఇద్దరి డ్యాన్స్ ల్లోని గ్రేస్ అదిరిపోయింది. అయితే ఈ పాట ఈ ప్రోమోతోనే సరి అట. ఫుల్ సాంగ్ కావాలంటే సినిమా చూడాల్సిందే అనేశారు. అంటే కనీసం లిరికల్ సాంగ్ కూడా లేదు. మరి థియేటర్స్ లో ఈ పాటకు ఎలాంటి అప్లాజ్ వస్తుందో కానీ ప్రోమో మాత్రం సింపుల్ గా అదిరిపోయింది అనే చెప్పాలి.