నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మే 1న థియేటర్స్ లోకి రాబోతోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం హిట్ మూవీస్ ఫ్రాంఛైజీలో వస్తోన్న థర్డ్ మూవీ. మొదటి రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ రెండు సినిమాల టెంప్లేట్ లోనే ఇదీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అయినా ఈ సారి యాక్షన్ డోస్ తో పాటు వయొలెన్స్ ను చాలా అంటే చాలా పెంచారని టీజర్, ట్రైలర్ తో తెలిసిపోయింది. అంతకు ముందే నాని ఇది పూర్తిగా పెద్దల చిత్రం అని తేల్చి చెప్పాడు. పెద్దల్లో కూడా సెన్సిటివ్ హార్ట్ ఉన్నవాళ్లు చూడొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రేంజ్ లో రక్తపాతం ఉండబోతోందన్నమాట. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో నాని చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా రిలీజ్ గా రాబోతోన్న హిట్ మూవీకి దర్శకుడు శైలేష్ కొలను. కానీ ఈ ప్రమోషన్స్ లో అతను ఎక్కడా కనిపించడం లేదు. అతని ఉనికి కూడా లేదు. ఇది కావాలనే చేస్తున్నారా లేక శైలేష్ కు ఇంకేదైనా పని ఉందా అనే అనుమానాలూ రాకపోవడం లేదు.
నిజానికి హడావిడీగా చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ చేసే అవసరం కూడా లేదీ చిత్రానికి. అలాంటి సమస్యలు వస్తాయనే చాలా ముందుగానే సెన్సార్ చేయించారు. సో.. దర్శకుడు ఏమంత బిజీగా లేడు. అయితే అతను గతంలో చేసిన సైంధవ్ చిత్రం టైమ్ లో చేసిన కొన్ని కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. అందుకు భిన్నంగా సినిమా డిజాస్టర్ అయింది. ఆ ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతాయి.. అప్పుడు ఈ మూవీకి ఇబ్బంది అవుతుందనుకుని అతన్ని స్కిప్ చేశారేమో అంటున్నారు. నిజానికి ఈ తరహా మూవీస్ కు సంబంధించి దర్శకుడు చెప్పే సమాధానాలు కూడా ప్రమోషన్స్ లో కీలకం అవుతాయి. ఒకవేళ తెలుగులో ఇబ్బంది అనుకున్నా ఇతర రాష్ట్రాల ప్రమోషన్స్ కు అయినా అతన్ని తీసుకువెళ్లాల్సింది అంటున్నారు.
ఈ చిత్రానికి నిర్మాత కూడా నానియే కాబట్టి అతనే అన్నీ చూసుకుంటున్నాడు అనుకోవాలా.. లేక సినిమా మొత్తం తన భుజాలపైనే మోస్తున్నాడు అనే కలరింగ్ వచ్చేలా చేసుకుంటున్నాడా అనేది తెలియదు కానీ.. ఈ మూవీ ప్రమోషన్స్ లో దర్శకుడు పూర్తిగా మిస్ కావడం చూస్తుంటే దర్శకత్వం కూడా నానీయే చేసుకున్నాడేమో అనే డౌట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు.