Who is Gangubai Kathiawadi : వేశ్యనుంచి మాఫియా క్వీన్‌గా.. గంగూబాయ్ రియల్ స్టోరీ
Who is Gangubai Kathiawadi: బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో గంగూబాయి కతియావాడి తెరకెక్కుతోంది.;
Who is Gangubai Kathiawadi: బాలీవుడ్ నటి అలియా భట్ కథానాయికగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో గంగూబాయి కతియావాడి అనే సినిమా తెరకెక్కుతోంది.. ప్రముఖ దర్శకుడు, స్టార్ హీరోయిన్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 24న విడుదల కానున్న ఈ చిత్ర వేశ్యా వాటిక నేపథ్యానికి సంబంధించినది. ఆమె గంగూబాయి కతియావాడి..
"బలం. శక్తి. భయం! ఒక్క చూపు, వెయ్యి భావోద్వేగాలు. #Gangubai Kathiawadi ఫస్ట్ లుక్‌ని ప్రదర్శిస్తూ.. " పోస్టర్ రిలీజ్ అయినవెంటనే, నటి బోల్డ్ పాత్రలో నటించడం చర్చనీయాంశంగా మారింది. వ్యభిచార గృహ యజమాని జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దీంతో గంగూబాయి గురించి గూగుల్‌లో వెతకడం మొదలు పెట్టారు నెటిజన్స్.
వేశ్యావాటిక యజమాని మాఫియా క్వీన్‌గా మారిన తీరు..
గంగూబాయి కతియావాడి గుజరాత్‌లోని కతియావాడిలో జన్మించింది. ఆమె అసలు పేరు గంగూబాయి హర్జీవందాస్. ఎస్ హుస్సేన్ జైదీ రాసిన పుస్తకం 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' ప్రకారం, ఆమె చాలా చిన్న వయస్సులోనే వ్యభిచార గృహంలోకి బలవంతంగా అడుగుపెట్టింది. ఆమె ముంబైలోని కామాటిపురా ప్రాంతంలో వేశ్యగృహం నడిపింది. తరువాత అనేక మంది కరుడుగట్టిన నేరస్థులు ఆమెకు కస్టమర్‌లుగా మారారు. గంగూబాయి సెక్స్ వర్క్స్ కోసం, అనాథల సంక్షేమం కోసం చాలా కృషి చేసింది.
గంగూబాయి మొదట బాలీవుడ్ సినిమాల్లో నటి కావాలని కోరుకుంది. ఆమెకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె అతని తండ్రి దగ్గర పనిచేసే అకౌంటెంట్‌తో ప్రేమలో పడింది. ఇంట్లో వాళ్లు తమ ప్రేమను అంగీకరించరని, పెళ్లికి ఒప్పుకోరని ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. అక్కడ పెళ్లి చేసుకున్నారు.. కానీ పూట గడవడం కష్టంగా మారడంతో భర్త ఆమెను వేశ్యాగృహంలో రూ.500లకు అమ్మేశాడు. దిక్కుతోచని స్థితిలో అక్కడే ఆమె జీవితాన్ని గడపవలసి వచ్చింది. కస్టమర్లతో సంబంధాలు నెరిపింది.
నేరస్థులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంది. ఈ క్రమంలో కరడు గట్టిన నేరస్ధుడు కరీంలాలా గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె కరీంలాలా వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయమని వేడుకుంది. అతడు ఆమెను తన చెల్లెలిగా భావించాడు. ఆమె అతడికి రాఖీ కట్టి సోదరుడిపై తన ప్రేమను ప్రకటించింది. ఇది జరిగిన కొన్నాళ్లకు రాఖీ కట్టిన సోదరి గంగూబాయికి కామాటిపురా ప్రాంతాన్ని అప్పగించాడు కరీం. ఈ క్రమంలో ఆమె మాఫియా క్వీన్స్‌లో ఒకరిగా మారింది. బలవంతంగా వ్యభిచార గృహంలోకి అడుగుపెట్టిన వారికి అండగా నిలబడేది.. వాళ్లు తమ సొంత కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించేది.. ఉపాధి కల్పించేది.
ఆమె తన జీవితాన్ని సెక్స్-వర్క్స్ మరియు అనాథల అభివృద్ధి కోసం అంకితం చేసింది. అదే సమయంలో ముంబైలోని వేశ్యల మార్కెట్‌ను తొలగించాలని చూసినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి కూడా ఆమె నాయకత్వం వహించారు. తమపై ఆమె చూపించిన ప్రేమకు గుర్తుగా గంగూబాయి విగ్రహాన్ని కామాటిపురాలో నెలకొల్పారు. ఇప్పటికీ ముంబైలోని కామాటిపురలో ఆ విగ్రహం ఉండడం విశేషం.