Samantha Ruth Prabhu : సమంత ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా

Update: 2024-08-31 07:56 GMT

సినిమా పరిశ్రమలో మహిళా నటులకు రక్షణ లేదు అంటూ కొన్నాళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి మీ టూ అనే పేరు పెట్టి అంతా ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని పరిశ్రమలు విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. మరికొన్ని పరిశ్రమలు తూతూ మంత్రంగా విమెన్ ప్రాటెక్షన్ పేరుతో కమిటీలు వేసి ఊరుకున్నాయి. కానీ కాస్టింగ్ కౌచ్ లాంటి వ్యవహారం అంత సులువుగా బయటకు రాదు అని అందరికీ తెలుసు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్ప అది జరగని పని. బట్ ఇలాంటి కమిటీలు ఉంటే.. విషయం అక్కడి నుంచి పరిష్కారం అవుతుంది. తాజాగా మళయాలంలో హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు.. అక్కడి సీనియర్ యాక్టర్ సిద్ధిఖీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇతను ఆర్టిస్ట్స్ ఆఫ్ మలయాళ మూవీ అసోసియేషన్ (అమ్మ) లో కీలక సభ్యుడు కూడా. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ సిద్ధిఖీ తన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అలాగే అధ్యక్షుడుగా ఉన్న మోహన్ లాల్ తో పాటు మొత్తం అమ్మ కమిటీ అంతా రాజీనామా చేసి కొత్త ప్యానెల్ ను ఎంచుకోబోతోంది.

సో.. ఇప్పుడు అందరి దృష్టి మలయాళ సీమపై పడింది. అయితే తెలుగులో కూడా ఇలాంటి కమిటీ ఉండాలంటూ సమంత చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC సంస్థను అభినందించిన సమంత.. టాలీవుడ్ లో కూడా సపోర్ట్ గ్రూప్ 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' నడవాలి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీని వల్ల పనిచేసే చోట మహిళలకు భద్రత లభిస్తుందని తన విన్నపంలో పేర్కొంది సమంత.

మొన్నటి వరకూ స్టార్ హీరోయిన్ గా వెలిగిన సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెడుతోంది. ఈ తరుణంలో ఆమె తెలుగు పరిశ్రమ గురించి బాధ్యతగా మాట్లాడ్డం అభినందించాల్సిన విషయం అనే చెప్పాలి.

అయితే తెలుగులో ఇలాంటి కమిటీలు ఉంటే.. చాలా సమస్యలు బయటకు వస్తాయని గుసగుసలు పోతున్నారు. అంటే సమస్య ఉందనే కదా అర్థం. అందుకే మరికొంతమంది స్టార్ హీరోయిన్లు సమంతకు సపోర్ట్ గా నిలిచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే అలాంటి కమిటీ ఇక్కడా ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. 

Tags:    

Similar News