Tamil Nadu: పదేళ్ల పాప హత్య మిస్టరీ.. స్కూల్ కిచెన్‌లోనే..
Tamil Nadu: కనీసం హత్య, ఆత్మహత్య లాంటి పదాలకు పూర్తిగా అర్థం కూడా తెలిసుండదు ఆ చిన్నపిల్లకు.;
Tamil Nadu: కనీసం హత్య, ఆత్మహత్య లాంటి పదాలకు పూర్తిగా అర్థం కూడా తెలిసుండదు ఆ చిన్నపిల్లకు. అలాంటి తనను అంత కిరాతకంగా ఎలా చంపాలి అనిపించిందో ఆ దుండగులకు. రోజూ ఏదో ఒక హత్య గురించో, ఆత్మహత్య గురించో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇది కూడా అలాంటి ఓ వార్తే. కానీ ఈసారి ప్రాణాలు కోల్పోయింది ఓ 10 ఏళ్ల పాప.
తమిళనాడులోని దిండుగల్ ప్రాంతంలో ఉన్న పంచాయత్ యూనియన్ మిడిల్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న పాప.. రోజూ లంచ్ బ్రేక్‌లో ఇంటికి వెళ్లేది. కానీ బుధవారం తాను ఇంటికి వెళ్లలేదు. దీంతో కంగారుపడిన పాప తల్లిదండ్రులు, టీచర్లు తనను వెతికే పనిలో పడ్డారు. సాయంత్రం వరకు పాప జాడ దొరకలేదు.
ఇంతలో స్కూల్ కిచెన్ దగ్గర్లో పాప సగం కాలిన శవం దొరికింది. కాలిన గాయాలతో, కొన ఊపిరితో ఉన్న పాపను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. కానీ మార్గమధ్యలోనే తాను ప్రాణాలు విడిచింది. తన కూతురు మరణవార్తను తట్టుకోలేని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. అంతే కాక వారికి న్యాయం జరగాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం పాప ఒంటిపై లైంగిక దాడికి సంబంధించిన ఎలువంటి గాయాలు లేవని నిర్దారణ అయ్యింది. ఇప్పటివరకు ఈ కేసులు అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పాప కుటుంబ సభ్యులకు హామి ఇచ్చారు పోలీసులు.