Mulugu District : మంటగలిసిన మానవత్వం .. బ్రతికి ఉండగానే శ్మశానవాటికకు

Mulugu District : ములుగు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వెంకటాపూర్‌ చెందిన కేసోజు లక్ష్మణాచారి కొద్ది రోజుల కిందట ప్రమాదవశాత్తూ కిందపడడంతో వెన్నెముక విరిగిపోయింది.

Update: 2022-04-28 11:31 GMT

Mulugu District : ములుగు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వెంకటాపూర్‌ చెందిన కేసోజు లక్ష్మణాచారి కొద్ది రోజుల కిందట ప్రమాదవశాత్తూ కిందపడడంతో వెన్నెముక విరిగిపోయింది. ఆయన్ను వరంగల్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా అతని పరిస్థితి క్షీణించింది. పరిస్థితి చేయి దాటిపోవడతో తప్పని పరిస్థితుల్లో ఇంటికి తీసుకొచ్చేశారు. అయితే వారికి సొంతిల్లు లేకపోవడంతో ఊహించని కష్టం ఎదురైంది. తన ఇంట్లో మనిషి చనిపోతాడేమోనన్న భయంతో ఇంటి ఓనర్ బయటికి గెంటేశాడు. దీంతో గత్యంతరం లేక... కొన ఊపిరితో ఉన్న లక్ష్మణాచారిని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచాడు.

లక్ష్మణాచారి కుటుంబం గత 20 ఏళ్లుగా అద్దెకు ఉంటోంది. కొడుకు ఆరోగ్యం బాగోకపోవడంతో అతని తల్లి కూలీ పనులకు పోయి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అనారోగ్యంతో కొడుకు కొనఊపిరితో కొట్టుకుంటున్న సమయంలో ఇంటి యజమాని బయటికి పొమ్మనడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. ఏం చేయాలో పాలుపోని దయనీయ స్థితిలో లక్ష్మణాచారి బతికుండగానే శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. చివరిగా ఆయన ప్రాణం కూడా అక్కడే పోయింది.

చనిపోయాక వెళ్లాల్సిన చోటుకి బతికుండగానే తీసుకెళ్లాల్సి వచ్చిందని.. తన కొడుకు శ్మశానంలోనే కన్నుమూశాడని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏళ్ల తరబడి వేల కోట్లతో పేదల కోసం ప్రభుత్వాలు ఇళ్లు కడుతూనే ఉన్నాయి. కానీ తమలాంటి బతుకులు ఎందుకు మారడం లేదని ఆమె కన్నీళ్లు ప్రభుత్వాలను ప్రశ్నించాయి. బతికుండగానే శ్మశానానికి తీసుకెళ్లాల్సిన దారుణ పరిస్థితులు ఇంకా ఎందుకున్నాయని నిలదీస్తున్నాయి.

ఇంటి యజమానుల వేధింపులు, రూల్స్, వాళ్లు చెప్పినట్లు నడుచుకోవడం వంటివాటితో ఇప్పటికీ అనేక పేద కుటుంబాలు నలిగిపోతున్నాయి. అంతే కాదు.. ఆరోగ్యం బాగా లేక జబ్బు చేస్తే అద్దె ఇళ్లల్లో ఉండనీయడం లేదు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. దురదృష్టవశాత్తు చనిపోతే మృతదేహాన్ని ఇంట్లోకి కూడా రానివ్వని ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు.. పాలకులు స్పందించి పేదలకు అండగా నిలవాలని ఆశిద్దాం..

Tags:    

Similar News