Banjara Hills Drugs Case: రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ కేసులో బయటకు వస్తున్న రహస్యాలు..

Banjara Hills Drugs Case: రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్‌ పబ్‌ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి

Update: 2022-04-06 11:53 GMT

Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌ రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్‌ పబ్‌ చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సినీ,రాజకీయ,బిజినెస్‌ వర్గాలకు చెందిన యువతను ఆకట్టుకునేందుకు నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం హోటల్ బార్‌కు ఉన్న 24 గంటల అనుమతిని చూపుతూ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. పబ్‌లో జరిగే వ్యవహారం బయటకు తెలియకుండా పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు నిర్వాహకులు.

ఫుడింగ్ అండ్ మింక్ పేరుతోనే పామ్‌ యాప్‌ రూపొందించారు. యాప్‌లో పేరు నమోదు చేసుకునేందుకు ఒక్కొక్కరి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు 50 వేలు వసూలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎప్పుడైనా పబ్‌కు రావొచ్చు. ఇష్టమైనంత టైం ఉండొచ్చు. అలా ఆకర్షించే టైంలోనే వినియోగదారులకు డ్రగ్స్‌ రుచి చూపించినట్లు దర్యాప్తులో తెలుస్తోంది.

యాప్‌లో 250 మంది మెంబర్స్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు..ఆదివారం తెల్లవారుజామున పబ్‌లో అదుపులోకి తీసుకున్న 148 మందిలో ఎవరెవరూ యాప్‌లో పేరు నమోదు చేసుకున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. 45 గ్రాములకు పైగా కొకైన్‌ పబ్‌లోకి వచ్చినట్టు...దాడులు జరిగే సమయానికి 40 గ్రాములు వినియోగించినట్లు ఆధారాలు సేకరించారు అధికారులు. యాప్‌లోని 30-40 మంది వరకూ పార్టీ జరిగిన రోజు కొకైన్ తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

మరోవైపు పబ్‌ పార్ట్నర్‌ అభిషేక్ ఫోన్‌లోని 200కు పైగా అనుమానిత ఫోన్‌ నంబర్ల వివరాలను సేకరించారు. అందులో డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారి వివరాలు ఉన్నట్లు సమాచారం. పబ్‌లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు, సిగరెట్‌ స్ట్రిప్‌లను ఇప్పటికే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. వాటి రిజల్ట్స్ వచ్చే లోపు పామ్‌ యాప్...స్వాధీనం చేసుకున్న ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉన్న అనుమానిత సమాచారాన్ని విశ్లేషించి ఎవరెవరికి నోటీసులివ్వాలి..ఎవరి దగ్గర శాంపిల్స్ తీసుకోవాలనేది నిర్ణయించనున్నారు.

పబ్‌ నిర్వహణపై పార్ట్నర్స్ మధ్య గొడవలున్నాయని తెలుస్తోంది. అంతర్గత గొడవల కారణంగానే రహస్యంగా సాగుతున్న వ్యవహారం పోలీసుల వరకు చేరినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని, కిరణ్‌రాజ్‌లను పట్టుకునేందుకు పోలీసులు 5 బృందాలను నియమించారు. రిమాండ్‌లో ఉన్న అనిల్ కుమార్‌, అభిషేక్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు ఇవాళ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

Tags:    

Similar News