పబ్‌జీ గేమ్ ప్రాణాలు తీస్తూనే ఉంది. ఫోన్ వాడొద్దని తండ్రి మందలించాడన్న కారణంతో ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని బండవెల్కిచర్లలో చోటుచేసుకుంది. ఉప్పరి అనంతయ్య దంపతులు కుల్కచర్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు ఓంకార్ పదో తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయి. దీంతో అనంతయ్య అప్పు చేసి మరీ మూడు నెలల క్రితం కొడుకు కోసం సెల్‌ఫోన్ కొన్నాడు. బాలుడు నిత్యం ఆన్‌లైన్ తరగతుల పేరుతో పబ్‌జీ గేమ్ ఆడుతూ దానికి బానిసయ్యాడు. గమనించిన అనంతయ్య కుమారుడిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఓంకార్ ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నాయి.