KOMATIREDDY: ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండి
కోమటిరెడ్డిపై వార్తలపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్..?
రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన నేత… వ్యక్తిగత జీవితంలో తీరని గాయాలు మోస్తున్న తండ్రి…ఈ రూపాలూ ఒక్క క్షణంలో ఒక్కటయ్యాయి. మీడియా ఆరోపణలపై స్పందిస్తూ, మాటల మధ్యలో ఆవేదన ఉప్పొంగిన వేళ, ఆయన కళ్లలో కనిపించిన బాధ ఒక రాజకీయ నేతది మాత్రమే కాదు… ఒక మనిషిది. అదే బాధ మాటల రూపంలో బయటకు వచ్చింది.
మీడియాలో తనపై, ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారులపై వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారం సరికాదని, అది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులకు కుటుంబాలు ఉంటాయని, వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజానిదేనని ఆయన గుర్తుచేశారు. వ్యూస్, రేటింగ్స్ కోసం వాస్తవాలకు దూరంగా కథనాలు రాయడం తగదని మీడియాను ఉద్దేశించి మంత్రి తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని, అలాంటి కథనాలు వారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. “ఇది సరైనదే అనుకుంటే కొనసాగించండి… ఇంకా సరిపోదనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి” అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక వేదనకు అద్దం పట్టాయి. తన ఆరోగ్య పరిస్థితిపై కూడా మంత్రి స్పందించారు. గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్య వల్ల తాను తక్కువగా మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఈ సమస్య పుట్టుకతోనే తనకు ఉందని, చికిత్స కోసం అమెరికా వెళ్లి వైద్యం చేయించుకున్నప్పటికీ పూర్తిగా తగ్గలేదన్నారు. వైద్యుల సూచన మేరకు తక్కువగా మాట్లాడటమే ప్రస్తుతం పరిష్కారమని తెలిపారు. అందుకే ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడటం మానేశానని చెప్పారు.
తన ఫోన్ నంబర్ మార్చేశాడని మీడియాలో వచ్చిన కథనాలపై కూడా ఆయన స్పందించారు. ఆ నంబర్ చాలా పాతదని, దాదాపు 20 ఏళ్లకు పైగా అదే నంబర్‌ను ఉపయోగిస్తున్నానని తెలిపారు. అందరి దగ్గర అదే నంబర్ ఉండటంతో అందరూ అదే నంబర్‌కు కాల్ చేస్తుండటంతో, ఆ ఫోన్‌ను పీఏ వద్ద ఉంచానని చెప్పారు. “ఆ నంబర్‌తోనే నేను ఆరు సార్లు గెలిచాను. అలాంటి నంబర్‌ను నేను ఎలా పక్కన పెడతాను?” అని ప్రశ్నించారు. కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో జరిగే అంశమని, అందులో తన పాత్ర లేదని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాలకంటే ప్రజాసేవకే తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అనవసరంగా తనను మానసిక హింసకు గురి చేయొద్దని మీడియాను వేడుకున్నారు. తనపై విమర్శలు ఉంటే వ్యక్తిగతంగా తనపై రాయాలని, కానీ మహిళా అధికారులను టార్గెట్ చేయొద్దని కోరారు. మహిళా ఐఏఎస్ అధికారులపై వస్తున్న ఆరోపణలు అసత్యమని, అలాంటి కథనాలు వారి కష్టపడి సాధించిన గుర్తింపును దెబ్బతీస్తాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “ఎంతో కష్టపడి ఐఏఎస్ అవుతారు. అలాంటి అధికారులపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైంది కాదు” అన్నారు.
మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం
ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులంతా తనకు పాత మిత్రులేనని, తన గురించి వారికి బాగా తెలుసునని అన్నారు. అయినప్పటికీ తనను ఇలా మానసికంగా హింసిస్తున్నారని వేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంలోని విషాదాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయాను. అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేదేమో” అంటూ కన్నీటితో కూడిన స్వరంలో చెప్పారు. అయితే ఆ బాధ నుంచి బయటపడేందుకు తన కుమారుడి పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి, పేదలకు సహాయం చేస్తున్నానని తెలిపారు. ఈ పరిణామాలన్నీ తనను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, మహిళా అధికారులను కూడా తీవ్రంగా బాధిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఉన్న ప్రాధాన్యతను గౌరవిస్తున్నానని, అదే సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. వ్యక్తిగత గౌరవం, మహిళల ఆత్మాభిమానం దెబ్బతినకుండా వార్తలు రాయడం మీడియా ధర్మమని, అదే ప్రజాస్వామ్యానికి బలమని ఆయన వ్యాఖ్యల సారాంశం.