పెద్దపల్లి జిల్లా సుల్తా నాబాద్‌లో ఈ నెల 18న చెల్లెలు ఆత్మహత్య చేసుకోగా, కేసు నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేయడంతో ఆమె మృతదేహం మార్చురీలోనే మగ్గుతోందని మనస్తాపం చెందిన ఓ అన్న పురుగుల మందు తాగాడు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన చిక్కులపల్లి నిర్మల (40), సుల్తానాబాద్ మండలం నీరుకుల్లకు చెందిన తిరుపతి రావు భార్యాభర్తలు. ఈనెల18న నిర్మల ఇంట్లో నుంచి వెళ్లిపోగా, మరుసటి రోజు ఊరి శివారులోని బావిలో శవమై కనిపించింది. ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయగా, నిర్మల భర్త తిరుపతిరావుకు, నిర్మల పుట్టింటి వారికి మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దీంతో రెండు రోజులుగా మృతదేహం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖాన మార్చురీలోనే మగ్గుతోంది. రోజులు గడుస్తున్నా రాజీ చర్చలు కొలిక్కి రాకపోవడం, పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని మనస్తాపానికి గురైన మృతురాలి సోదరుడు పడితల బాపురావు పీఎస్సమీపంలోని ఓ టీ స్టాల్ ముందు గడ్డి మందు తాగాడు. గమనించిన స్థానికులు అతడిని కరీంనగర్దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఘటనపై ఎస్ఐ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ తమకు కంప్లయింట్ రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని చెప్పారు.