కాల్పుల మోతతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మలక్ పేట్ శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పులు జరిపారు పలువురు దుండగులు. కంట్లో కారం కొట్టి మరీ షూట్ చేయడంతో చందూనాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పార్క్ లో వాకింగ్ చేస్తున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రక్తం మడుగులో పడి ఉన్న చందూ నాయక్ ను చూసి భయబ్రాంతులకు లోనయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ వాముపక్ష నాయకులు. CPI రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా కూడా ఉన్నారు. మలక్ పేట్ పరిధిలోని మారుతినగర్ లో ఆయన నివాసం ఉంటున్నారు. రోజులాగే మార్నింగ్ వాక్ కి వెళ్ళిన చందు నాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.. దగ్గర నుండి గురిపెట్టి కాల్చడంతో చందూ నాయక్ స్పాట్ లోనే చనిపోయారు.దీంతో ఆయన కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. మృతదేహం దగ్గర వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఈఘటనపై విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.