తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ పట్టుబడిన కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. మంగళవారం రాత్రి భూపాలపట్నం గ్రామం వద్ద పంట పొలాల మధ్య ఉన్న గెస్ట్ హౌస్‌లో 20 మంది మద్యంతోపాటు మాదకద్రవ్యాలతో పార్టీ చేసుకున్నట్లు సమాచారంతో పోలీసులు దాడి చేశారు. గెస్ట్ హౌస్ వద్ద కారులో కొకైన్ ప్యాకెట్లు... గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారో పోలీసులు విచారణ చేపడుతున్నారు. రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువుకు చెందిన ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.