Epstein Files: ఎప్స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ
ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు... వెలుగులోకి అనిల్ అంబానీ పేరు... పదవులు కోల్పోతున్న ప్రముఖులు
అమెరికన్ ఫైనాన్సర్ జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక నేరాల దస్త్రాలు ప్రపంచ దేశాల రాజకీయ, వ్యాపార వర్గాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ సంచలన దస్త్రాల్లో భారత పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2017 నుండి 2019 మధ్య కాలంలో వీరిద్దరి మధ్య జరిగిన సందేశాల్లో వ్యాపారాలు, మహిళలు, వ్యక్తిగత భేటీలకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో హీరోయిన్ల ఎంపిక అంశాలను కూడా ఎప్స్టీన్తో చర్చించినట్లు దస్త్రాలు వెల్లడిస్తున్నాయి.ఈ దస్త్రాల్లోని సమాచారం ప్రకారం, అనిల్ అంబానీ, ఎప్స్టీన్ మధ్య సంబంధాలు అమెరికా అధికారులు ఎప్స్టీన్పై కేసులు నమోదు చేయడానికి కొన్ని నెలల ముందు వరకు కొనసాగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆర్థిక వేదికలు, వ్యక్తిగత సమావేశాల ప్రణాళికలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఒక సందర్భంలో పారిస్ నగరంలో భేటీ కావాలని, మరోసారి న్యూయార్క్‌లోని ఎప్స్టీన్ నివాసంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆధారాలు లభించాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫైల్స్ ధాటికి ఐరోపా దేశాలు వణికిపోతున్నాయి. బ్రిటన్ రాజకుమారుడు ఆండ్రూ తన ప్రిన్స్ హోదాను, రాజభవన వసతిని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణలు నిరూపితం కావడంతో రాజకుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇది బ్రిటన్ చరిత్రలో ఒక పెద్ద కుదుపుగా నిలిచింది. నార్వే, స్వీడన్, స్లొవేకియా వంటి దేశాల్లో కూడా ప్రముఖులు ఈ వివాదంలో చిక్కుకున్నారు. నార్వే మాజీ ప్రధాని థోర్బ్జోన్ జాగ్లాండ్పై ఆ దేశ దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. ఎప్స్టీన్తో ఉన్న పరిచయం కారణంగా నార్వే రాజకుమారుడు మెటే-మారిట్ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్రిటన్ రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం ముదురుతోంది. ఆరోపణలు ఉన్న పీటర్ మండేల్సన్ను రాయబారిగా నియమించినందుకు ప్రధాని కీర్ స్టార్మర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నియామకం ఆయన పదవికే ముప్పు తెచ్చేలా ఉంది. ఇప్పటికే మండేల్సన్ జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అమెరికా న్యాయశాఖ ఈ దస్త్రాలను చట్టసభ సభ్యుల సమీక్షకు అనుమతించడం మరో కీలక పరిణామం. ఇప్పటివరకు కొన్ని భాగాలను మాత్రమే వెల్లడించిన అధికారులు, ఇప్పుడు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ దస్త్రాలను అందుబాటులో ఉంచారు. అయితే వీటిని అత్యంత గోప్యంగా ఉంచాలని, కేవలం న్యాయశాఖ కంప్యూటర్లలోనే చూడాలని కఠిన నిబంధనలు విధించారు. లాత్వియా, లిథ్వేనియా, పోలండ్ దేశాలు కూడా ఈ ఫైల్స్‌పై ప్రత్యేక దర్యాప్తు అధికారులను నియమించాయి. తమ దేశాలకు చెందిన ప్రముఖులు ఎవరైనా ఈ నేరాల్లో భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన కేసు కాదని, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన ఒక నెట్వర్క్ అని తేలింది.