FORENSIC: పేలుడు మిస్టరీని ఛేదించేందుకు సాంకేతిక యుద్ధం
పేలుడు వెనుక ఉన్న నిజం కోసం సాంకేతిక యుద్ధం.. లోకార్డ్ సూత్రం.. ప్రతి సూక్ష్మ ఆధారం ముఖ్యం.. ఘటనా స్థలం నుంచి సాక్ష్యాల వేట మొదలు
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఒక i20 కారు అకస్మాత్తుగా పేలడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇది కేవలం ఒక ప్రమాదమా లేక ఉద్దేశపూర్వక చర్యనా అనే ప్రశ్నలు భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారుతాయి. ఇటువంటి పరిస్థితులలో, అత్యాధునిక ఫోరెన్సిక్ విశ్లేషణ పేలుడు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పేలుడు తీవ్రత కారణంగా సాక్ష్యాలు విచ్ఛిన్నం కావడం, వాటిని సేకరించడం, విశ్లేషించడం ఒక సంక్లిష్ట ప్రక్రియ. పేలుడు జరిగిన వెంటనే, ఢిల్లీ ఫోరెన్సిక్ లాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకోవడం, పరిశోధన వేగాన్ని సూచిస్తుంది. ఈ ప్రక్రియలో.. వారి ప్రధాన లక్ష్యం, 'లోకార్డ్ మార్పిడి సూత్రం' ఆధారంగా, నేరస్థుడు వదిలివేసిన లేదా తీసుకెళ్లిన అతి చిన్న ఆధారాలను సేకరించడం. పేలుడు ప్రభావం, కాలిపోయిన వస్తువుల వ్యాప్తి నమూనా, ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాన్ని విశ్లేషించడం ద్వారా, నిపుణులు పేలుడు కేంద్ర బిందువును గుర్తిస్తారు. ఇది పేలుడు స్వభావం పై ప్రాథమిక అంచనాకు దారితీస్తుంది. మండే ద్రవాల జాడలు, పేలుడు అవశేషాలు, కార్బన్ అవశేషాలు వంటి అతి చిన్న ఆధారాలను కలుషితం కాకుండా గాలి చొరబడని ప్రత్యేక డబ్బాలలో సేకరిస్తారు. మట్టి నమూనాలను కూడా సేకరించి, ద్రవ పదార్థాలు నేలలోకి ఇంకిపోయాయా అని పరిశీలిస్తారు.
3D డాక్యుమెంటేషన్: లేజర్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సంఘటనా స్థలం 3D స్కెచ్లను రూపొందించడం వలన, పేలుడు ఎలా వ్యాపించింది, వస్తువులు ఎలా కదిలాయి అనే విషయాలను డిజిటల్‌గా పునఃసృష్టించి, లోతైన విశ్లేషణకు ఉపయోగపడుతుంది. విచ్ఛిన్నమైన ఆధారాలకు 'జీవం' పోయడం సేకరించిన సాక్ష్యాలు ప్రయోగశాలకు చేరుకున్నాక, ఆధునిక సాంకేతికతలు వాటిలోని రహస్యాలను ఛేదిస్తాయి.
గ్యాస్ క్రోమాటోగ్రఫీ-మాస్ స్పెక్ట్రోమెట్రీ (GC-MS): ఈ సాంకేతికత ద్వారా, నమూనాల్లోని పెట్రోల్, కిరోసిన్ వంటి మండే ద్రవాల ఆవిరులను కచ్చితంగా గుర్తిస్తారు. ఇది పేలుడుకు ఉపయోగించిన పదార్థం స్వభావంపై స్పష్టతనిస్తుంది. పేలుడు శకలాల ఉపరితల స్వరూప శాస్త్రాన్ని పరిశీలించి, సల్ఫర్, నైట్రోజన్, లెడ్ వంటి అతి సూక్ష్మ మూలకాలను గుర్తిస్తుంది. ఈ మూలకాల ఉనికి, పేలుడుకు ఉపయోగించిన పదార్థం రకాన్ని నిర్ధారించడంలో కీలకం. కాలిన అవశేషాల రసాయన బంధాలను విశ్లేషించి, అది ఏ రకమైన పేలుడు పదార్థమో కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫోరెన్సిక్ ఆధారాలను కేవలం రసాయన విశ్లేషణకు మాత్రమే పరిమితం చేయకుండా, దర్యాప్తు సంస్థలు ఇతర కీలక అంశాలతో అనుసంధానిస్తాయి. ప్రయోగశాలలో గుర్తించిన ప్రత్యేకమైన లేదా వాణిజ్యపరమైన పేలుడు పదార్థాలను బట్టి, వాటిని కొనుగోలు చేసిన, తయారు చేసిన లేదా నిల్వ చేసిన వ్యక్తులపై దర్యాప్తును కేంద్రీకరిస్తారు. పేలిన కారు ట్యాంపరింగ్‌కు గురైనప్పటికీ, థర్మోకెమికల్ ఎచింగ్ వంటి పద్ధతుల ద్వారా ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను తిరిగి పొంది, వాహన యజమాని వివరాలను తెలుసుకోవచ్చు. సంఘటనా స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించడం ద్వారా అనుమానాస్పద కదలికలను ట్రాక్ చేస్తారు. అనుమానితుల ఫోన్లు, కంప్యూటర్ల వంటి డిజిటల్ పరికరాల్లో పేలుడు తయారీకి సంబంధించిన సమాచారం కోసం డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా లోతైన పరిశోధన చేస్తారు. ఈ అత్యాధునిక ఫోరెన్సిక్ పద్ధతుల సాయంతో, ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి, నిజాన్ని వెలికితీసే అవకాశం ఉంటుంది.