Guntur : ఎన్నారై నిత్య పెళ్లికొడుకు గుట్టురట్టు చేసిన పోలీసులు..

Guntur : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని అని చెప్పి 5 పెళ్లిల్లు చేసుకున్న నిత్యపెళ్లికొడుకు.

Update: 2022-07-29 09:40 GMT

Guntur : అతనో ఎన్నారై. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌. ఇంకేముంది.. అమెరికా కార్డు చూపి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఎట్టకేలకు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లిళ్లు చేసుకున్న ఎన్‌ఆర్‌ఐ నిత్య పెళ్లికొడుకు ఆట కట్టించారు గుంటూరు పోలీసులు. నాలుగో భార్య, అయిదో భార్య ఫిర్యాదుతో నిత్య పెళ్లికొడుకు వ్యవహారం వెలుగుచూసింది. విజయవాడలో ఉన్న అతనితో పాటు మధ్యవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందకూరుకు చెందిన కర్నాటి సతీష్‌బాబు గత పదమూడేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల కిందట వైజాగ్‌కు చెందిన శైలజను పెళ్లిచేసుకున్నాడు. వారికి పన్నెండేళ్ల కూతురుంది. ఆ తర్వత శైలజ బంధువైన లావణ్యతో పరిచయం చేసుకుని అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. 2017లో నర్సరావుపేట మండలం అన్నవరానికి చెందిన లక్ష్మీని మూడో వివాహం చేసుకున్నాడు.

మూడు నెలల పాటు ఇక్కడే ఉండి అమెరికా చెక్కేశాడు. లక్ష్మీ ఫిర్యాదుతో పోలీసులు... సతీష్‌ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోగా, ఆమెతో ఒప్పందం చేసుకుని విడాకులు తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత గుంటూరుకు చెందిన దివ్యను నాలుగో వివాహం చేసుకున్నాడు. యధావిధిగా మూడు నెలల తర్వాత చెప్పాపెట్టకుండా అమెరికా వెళ్లాడు.

దివ్య ఫిర్యాదుతో సతీష్‌పై పోలీసులు కేసు నమోదుచేశాడు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. శ్యామలానగర్‌కు చెందిన ఐదో భార్య కూడా మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో .. విజయవాడలో ఉన్న సతీష్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. 

Tags:    

Similar News