పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల నుంచి స్కూల్‌కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్(37)ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది. సీఎం స్టాలిన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి. బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.