Hostel Tragedy : తక్కువ మార్కులు వచ్చాయని హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Update: 2024-02-17 05:52 GMT

సున్నిత మనస్కులైన విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలనేది తెలియజేసేందుకు మరో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) (TSPSC) ఇటీవల గ్రూప్‌-4 పరీక్ష ఫలితాలు ప్రకటించింది. మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఈ విషాదం జరిగింది. ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటున్న శిరీష వయసు 24 ఏళ్లు. గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చాయని కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉందని సహచరులు తెలిపారు. ఇదే బాధలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మహబూబాబాద్‌ జిల్లా ముప్పారం గ్రామం యువతి శిరీష సొంత ఊరు. శిరీష గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చినందుకు ఆత్మహత్య చేసుకుందా లేక మరి ఏమైనా కారణాలు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలో చిక్కడపల్లి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హాస్టల్ లో ఫ్రెండ్స్, ఆమె సన్నిహితులను విచారణ చేస్తున్నారు.

Tags:    

Similar News