Hyderabad Drugs: అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ అరెస్ట్.. ఫార్మా కంపెనీ ముసుగులో..
Hyderabad Drugs: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ ఆశిష్ జైన్‌ను అరెస్ట్ చేశారు అధికారులు.;
Hyderabad Drugs: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ సప్లై కింగ్‌పిన్ ఆశిష్ జైన్‌ను అరెస్ట్ చేశారు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు. NCB సోదాల్లో డ్రగ్స్‌తోపాటు 3 కోట్ల 71 లక్షల రూపాయల నగదు కూడా సీజ్‌చేశారు. ఫార్మసీ ముసుగులో మాదకద్రవ్యాల్ని ఆశిష్ జైన్ విదేశాలకు సప్లై చేస్తున్నాడు. ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా NDPS యాక్ట్‌కి లోబడే డ్రగ్స్‌ను డీల్ చేస్తున్నట్టు నమ్మిస్తున్నాడు.
అమెరికా, ఇతర దేశాల్లో ఈ రెండేళ్లలో వెయ్యికి పైగా ఇలాంటి డీల్స్ చేశాడు. వీటికి సంబంధించిన పేమెంట్లను క్రెడిట్‌కార్డ్, పేపాల్, బిట్‌కాయిన్ లాంటి వాటి ద్వారా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడీ ముఠాలో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో తేల్చేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు NCB హైదరాబాద్ అధికారులు. ఇంటర్నెట్ ఫార్మసీ పేరుతో.. ఫార్మా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా మోసం చేస్తూ వీళ్లు సాగిస్తున్న దందాపై పక్కా సమాచారం రావడంతో దాడులు చేశారు.
దోమలగూడలో జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాలు చేసి మొత్తం గుట్టు రట్టు చేశారు. డ్రగ్ డీల్స్ కోసం ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు సీజ్ చేశారు. ఆక్సికోడోన్, హైడ్రోకోడోన్, అఫ్రాజోలం, డయాజెపామ్, లోరాజెపామ్, ట్రామాడోల్ లాంటి మానసిక స్థితిపై ప్రభావం చూపించే సైకోట్రోఫిక్ డ్రగ్స్‌ను సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. ఈనెల 5వ తేదీన జరిపిన సోదాల్లో భారీగా డ్రగ్స్ కూడా సీజ్ చేశామన్నారు.