అల్లూరి జిల్లాలో ఘోరం జరిగింది.. ఇద్దరు బావమర్దులను సొంత బావ ఒకేసారి త్రిశూలంతో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో తరచూ గొడవ పడుతున్నాడని.. బావతో ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది కాస్తా పెద్ద ఘర్షణగా మారింది.
చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను హతమార్చాడు. జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.