కొత్తగా కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ రెండ్రోజులకే ట్రబుల్ ఇవ్వడంతో ఓ వాహనదారుడు షోరూమ్ కు వెళ్లాడు. షోరూమ్ నిర్వాహకులు పట్టించుకోలేదని ఆ షాప్ నకు నిప్పటించి తగులబెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగి ప్రాంతదంలో జరిగింది. మహ్మద్ నదీమ్ గత నెల 28న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.4లక్షలకు కొన్నాడు. అయితే, రెండ్రోజులకే అందులో టెక్నికల్ సమస్య తలెత్తింది. బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడంతో రిపేర్ చేయాలని ఓలా షోరూమ్‌కు వెళ్లాడు. పది రోజులైనా వారు స్కూటర్‌ను రిపేర్ చేసి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నదీమ్ మంగళవారం రాత్రి షోరూమ్ మూసి ఉన్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో అసలు విషయం తెలియడంతో నదీమ్‌ను అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. షోరూమ్ మాత్రం పూర్తిగా కాలిబూడిదైంది. ఆరు స్కూటర్లు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.