దిశ అత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో న్యూ ట్విస్ట్
దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ.. ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.;
దేశవ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన దిశ అత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితుల తల్లిదండ్రుల్ని.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రలోభాలకు గురి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏడాదికాలంగా ఎంతో మంది ప్రలోభపెట్టినా తాము వెనక్కి తగ్గలేదని నిందితుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ.. ప్రస్తుతం గ్రామస్థుల్నే తమపైకి ఉసిగొల్పుతున్నారని తెలిపారు. కేసు వెనక్కి తీసుకుంటే.. డబ్బులు వస్తాయని చెబుతున్న గ్రామపెద్దలు.. ఎవరు ఇస్తారో మాత్రం తెలపడం లేదు అని అంటున్నారు. ఇప్పుడీ పరిణామమే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కోర్టు తీర్పు మేరకు.. తాము నిర్ణయం తీసుకుంటామని.. ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గబోమని.. కేసు వెనక్కి తీసుకోబోమని.. తేల్చి చెబుతున్నారు.
మరోవైపు.. దిశ కేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ.. ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు నడిపిన లారీకి యజమాని అయిన శ్రీనివాస్‌రెడ్డిని విచారించాలని ఆమె కోరుతున్నారు. తెల్లవారుజామున.. తమ కుమారుణ్ని ఇంటి నుంచి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది శ్రీనివాస్‌రెడ్డేనని తెలిపారు. తమ కుమారుడి చావుకు కారణం శ్రీనివాస్‌రెడ్డే అంటూ.... పదేపదే నిలదీసినందుకు... తన భర్త కుర్మయ్యను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ నగర శివారులోని షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్ దిశను అపహరించి.. అత్యాచారం చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేసిన హక్కుల నేతలు, న్యాయవాదులు.. నిందితుల కుటుంబ సభ్యుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసును ఉపసంహరించుకోవాలంటూ ఏడాది కాలంగా రాయబారాలు పంపిన అజ్ఞాతవ్యక్తులు..ఎవరో అంతుపట్టడం లేదు.