అనంతపురంలో ఓ ఎన్నారై చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేయించుకొని బిల్డర్ కు డబ్బులు ఇవ్వకుండా కుచ్చుటోపి పెట్టాడు. ఇంటి నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బులు ఇవ్వాలని బిల్డర్ అడుగుతుండటంతో ఎన్నారై తన ఫోన్లు బ్లాక్ చేశాడు. చివరకు ఎన్నారై పై బిల్డర్ శరత్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతపురంలోని రాంనగర్ లో భారీస్థాయిలో ఇంటిని నిర్మించడానికి యుఎస్ లోని అట్లాంటాలో ఉంటున్న ఎన్ఆర్ఐ గుంటుపల్లి సురేంద్రబాబు బిల్డర్ శరత్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎన్ఆర్ఐకు చెందిన ఇంటి నిర్మాణం కోసం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు బిల్డర్ శరత్ బాబు చెప్పారు. అయితే కోటి 90 లక్షల రూపాయలు ఎన్నారై గుంటుపల్లి సురేంద్ర ఇచ్చాడని ... మిగిలిన డబ్బు ఇవ్వాలని అడగడంతో ఫోన్ బ్లాక్ చేసి ఇబ్బందులు పెడుతున్నడన్నారు. నగరంలోని ఓ ప్రముఖ వ్యక్తితో తమను బెదిరిస్తున్నాడని బిల్డర్ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు నెలల నుంచి తమ ఫోన్లకు స్పందించకుండా చివరకు తమ నెంబర్లను బ్లాక్ చేశాడని బిల్డర్ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ గుంటుపల్లి సురేంద్రబాబు పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బిల్డర్ చెప్పారు. ఏం చేయలేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చానని, జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు.