Banjara Hills Drugs Case: డ్రగ్స్ వాడకంపై వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..

Banjara Hills Drugs Case: బంజారాహిల్స్‌ లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ లో జరిగిన లేట్ నైట్‌ పార్టీ కలకలం రేపింది.

Update: 2022-04-03 14:46 GMT

Rahul Sipligunj (tv5news.in)

Banjara Hills Drugs Case: హైదరాబాద్ బంజారాహిల్స్‌ లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌ లో జరిగిన లేట్ నైట్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పార్టీలో కొంతమంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు తేలడంతో వ్యవహారం మొత్తం తీవ్ర వివాదాస్పదమైంది. శనివారం అర్ధరాత్రి దాటాక రాడిసన్‌ బ్లూ హోటల్‌ లోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సమయంలో అందులో 148 మంది ఉన్నారు.

వీరిలో హోటల్‌ 20 మంది సిబ్బందితో పాటు... 90 మందికి పైగా పురుషులు, 30 మందికి పైగా మహిళలు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్‌ ఎక్కువ సమయం నడుస్తుండడంతో.. అనుమానం వచ్చిన పోలీసులు పబ్‌ లో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ప్రతి రూమ్‌ని చెక్‌ చేశారు. చివరికి పబ్‌ కౌంటర్‌ లో ఐదు గ్రాముల కొకైన్ ఉన్న ఐదు పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌లో ఉన్న వారందరినీ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

వీరిలో చాలా మంత్రి ప్రముఖుల పిల్లలు ఉండడంతో... ఈ ఉదంతంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. చివరికి అందరి దగ్గర వివరాలు తీసుకున్న పోలీసులు... తదుపరి విచారణకు సహకరించాలని చెప్పి అందరినీ వదిలిపెట్టారు. అయితే పోలీసులు విడుదల చేసిన వారిలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. తను సరదాగా ఫ్రెండ్స్‌ తో కలిసి పార్టీకి వెళ్లానని.. అదే సమయంలో రైడ్‌ జరిగిందని... డ్రగ్స్‌ వాడకం గురించి తనకేమీ తెలియదంటూ రాహుల్ వివరణ ఇచ్చాడు.

ఇక అటు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న అనిల్‌ కుమార్‌, అభిషేక్‌ పుప్పాల ను అరెస్ట్‌ చేశారు. పబ్‌ యజమాని అర్జున్‌ వీరమాచినేని పరారీలో ఉన్నట్లు తెలిపారు. జనరల్‌ మేనేజర్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని.. అతను పూర్తి వివరాలు వెల్లడించడం లేదని... వెస్ట్‌ జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

పబ్‌ ను కోడ్‌ లాంగ్వేజ్‌ ద్వారా నిర్వహిస్తున్నారని.. పాస్‌ వర్డ్‌ చెప్పిన వారినే లోనికి పంపిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు ఈ కేసు వ్యవహారంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించలేదన్న అభియోగంతో బంజారాహిల్స్‌ సీఐ శివచంద్రను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అలాగే ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్‌మెమో ఇచ్చారు. శివచంద్ర స్థానంలో... ఈ రెయిడ్‌ కు నాయకత్వం వహించిన నాగేశ్వర్‌ రావును సీఐగా నియమించారు.

Tags:    

Similar News