కడప జిల్లా జమ్మల మడుగు మండలం గండికోట వద్ద ఓ యువతి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన వైష్ణవిగా గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం... ప్రొద్దుటూరు కు చెందిన వైష్ణవి బీటెక్ చదువుతోంది. రోజు ఇంటి దగ్గర నుండే కాలేజీకి వెళ్లి వస్తుండేది. ఎప్పటిలాగే సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన వైష్ణవి సాయంత్రం పొద్దుపోయిన కూడా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినప్పటికీ ఆమె ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో గండికోట వద్ద గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లి విచారించగా అది వైష్ణవి డెడ్ బాడీ అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు పోలీసులు. అయితే యువతీ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఉండడంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా వైష్ణవి నిన్న సాయంత్రం లోకేష్ అని యువకుడితో బైక్ పై గండిపేటకు వచ్చిందని.. ఆ తర్వాత ఆ యువకుడు ఒక్కడే అక్కడి నుంచి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై స్పష్టత రాలేదు. ఆమె వేసుకున్న చున్నీ తోనే గొంతు నులిమి చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.