ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాకు చెందిన డోన్ పాతపేట ఏరియా ఆసుపత్రి దొంగలకు అడ్డా అయిపోయింది. కొత్త ఆసుపత్రికి విలువైన సామాగ్రి తరలించకపోవడంతో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.. పాత ఆసుపత్రిలో మెడికల్ సామాగ్రిని, లక్షల విలువైన వాటర్ ప్యూరిఫయర్లను ఎత్తుకెళ్లారు. రోగులకు ఉపయోగపడే సామాగ్రి కొత్త హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయకపోవటంతో రక్షణ కరువైందని స్థానికులు వాపోతున్నారు.
హాస్పిటల్ గేటుకు తాళం వేయకపోవడంతో కొత్త బేబీ కిట్లు, హ్యాండ్ గ్లౌజులు, పీపీఈ కిట్లు, సర్జికల్ బ్లేడ్లు, ల్యాబ్ కు సంబంధించిన ట్యూబులు, కరెంటు వైర్లు, మోటార్లు, చోరీకి గురవుతున్నాయి. ఎవరికి పడితే వారు లోపలికి వచ్చి మెడికల్ సామాగ్రిని తీసుకెళ్తున్నారు. ఆసుపత్రికి సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో బూత్ బంగ్లాగా మారింది.