ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెప్పి మైనర్ బాలికలను అత్యాచారం చేసిన కేసులో ముగ్గురు యువకులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగు రోజుల క్రితం పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాల పేరు చెప్పి ముగ్గురు బాలికలు బడికి వెళ్లకుండా సికింద్రాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి ఉస్మానియా వర్సిటీకి వెళ్లేదారిలో ముగ్గురిని రోడ్డుపై వెళ్తున్న మధు అనే యువకుడు పలకరించి పరిచయం పెంచుకున్నాడు. వివరాలు తెలుసుకుని తన స్నేహితులు నీరజ్, మనోజ్ కు ఫోన్ చేసి పిలిపించి సదరు బాలికలకు పరిచయం చేశాడు. వారి మధ్య పరిచయం కాస్త గంటల్లోనే ప్రేమగా మారింది. యువకులు మాయమాటలు చెప్పి వారిని యాదగిరిగుట్ట తీసుకెళ్లి ఓ లాడ్జి అద్దెకు తీసుకున్నారు. ఇదే అదునుగా ముగ్గురు యువకులు అమ్మాయిలపై అత్యాచారం చేశారు. ప్రేమిస్తున్నామని చెప్పి తమపై లైంగిక దాడికి పాల్పడగా మైనర్ బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కన్నవారు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా యువకులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైరు యాదాద్రిలో మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జ్ నిర్వాహకుడిని అరెస్టు చేసినట్లు ACP శ్రీనివాస్ నాయుడు తెలిపారు..