AP: డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను’: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వర్గాల్లో కలకలం రేపాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ మహిళతో చనువుగా మెలుగుతున్నట్లు చూపించే వీడియోలు ఇటీవల ఎక్స్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ వీడియోలు నిజమా కాదా అన్న చర్చ నడుస్తున్న సమయంలో బీఆర్ నాయుడు స్వయంగా స్పందించి అవి నకిలీ డీప్‌ఫేక్ వీడియోలేనని స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియోల్లో తన రూపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ద్వారా అనుకరించి, అసత్య దృశ్యాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలు పూర్తిగా వక్రీకరించినవని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను కూడా దిగజార్చే కుట్రలో భాగమని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వేగంగా వ్యాప్తి చెందడంతో కొందరు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం బీఆర్ నాయుడు అధికారికంగా స్పందిస్తూ, తనపై జరుగుతున్నది దుష్ప్రచారమని స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు వ్యక్తులు ఈ వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తరింపజేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రూపొందించిన ఈ వీడియోలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని బీఆర్ నాయుడు తెలిపారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు. డీప్‌ఫేక్ సాంకేతికత ద్వారా తప్పుడు వీడియోలు సృష్టించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం ఇటీవల కాలంలో పెరుగుతున్న పరిణామంగా నిపుణులు పేర్కొంటున్నారు. తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ.. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిని వదిలేది లేదని ఆయన గట్టిగా చెప్పారు.