bats: గబ్బిలాలతో చికెన్ మంచూరియా
గబ్బిలాలతోనే బిర్యానీ, పకోడీ... చికెన్ పేరుతో రెస్టారెంట్లతో విక్రయాలు;
ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు చాలా మందే ఉన్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా ప్లేట్‌లో చికెన్ పీస్ ఉండాల్సిదే. చికెన్‌తో చేసిన ఏ వెరైటీ అయినా తెగ లాగించేస్తుంటారు. బిర్యానీ నుంచి పకోడీ వరకు చికెన్‌తో చేసిన వంటకాలకు ఉండే క్రేజే వేరు. ఇలా చికెన్ అంటే పడి చచ్చే వారు నిజంగానే షాక్ అయ్యే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
చికెన్‌కు ఉన్న క్రేజ్ కారణంగా తీవ్రంగా రేటు పెరుగుతోంది. దీంతో పలువురు అడ్డదారులు తొక్కుతూ గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారు. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్‌కు బదులుగా గబ్చిలాల మాంసాన్ని అమ్మేస్తున్నారు. గబ్బిలాల మాంసంతోనే బిర్యానీ, పకోడి, చిల్లీ చికెన్ వంటి వంటకాలు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నట్టు తమిళనాడులో బయటపడింది. గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతోన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సేలం జిల్లా ఓమలూరులోని డానిష్‌పేటై సమీపంలో చికెన్ అని చెప్పి గబ్బిలం మాంసం విక్రయిస్తోన్న ఇద్దరు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని విచారించగా సంచలన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఈ విషయాలు అధికారులనే విస్మయపరిచాయి.
తోప్పూర్ రామసామి అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పులు వినిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలో పలువురు అధికారులు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడుతోన్నకమల్, సెల్వంను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు గబ్బిలాల మాంసాన్ని అమ్ముతుండగా.. దానితోనే బిర్యానీ, పకోడి, చిల్లీచికెన్ వంటి వంటకాలను తయారు చేసి కస్టమర్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. ఇన్ని రోజులు మనం లొట్టలేసుకుంటూ తిన్నది గబ్బిలం మాంసం అని తెలియడంతో.. ఏం జరుగుతుందోనని భయంతో ఆందోళన చెందుతున్నారు.