కొరియర్ సంస్థల పేరుతో కొత్త మోసాలు
ఫెడెక్స్, బ్లూడార్ట్ వంటి కొరియర్ సంస్థల పేరుతో కొత్త తరహా మోసాలు..అప్రమత్తంగా ఉండాలని జెరోదా సీఈవో నితిన్ కామత్ హెచ్చరిక;
ఈజీ మనీ కోసం దుండగులు కొత్త దారులు వెతుకుతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని జెరోదా సీఈవో నితిన్ కామత్ హెచ్చరించారు. ఫెడెక్స్, బ్లూడార్ట్ వంటి కొరియర్ సంస్థల పేరుతో కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. పార్శిల్‌లో మాదకద్రవ్యాలు గుర్తించామని బెదిరింపులకు గురి చేస్తూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు నితిన్ కామత్ తెలిపారు. తన సహోద్యోగికి ఎదురైన ఓ సంఘటనను ఆయన ట్విటర్ యూజర్లతో పంచుకున్నారు. ఫెడ్‌ఎక్స్ నుంచి మాట్లాడుతున్నామని తన సహోద్యోగికి ఓ వ్యక్తి కాల్ చేశాడని.. మీ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పాడని ట్వీట్‌లో నితిన్ కామత్ తెలిపాడు. అనంతరం నకిలీ పోలీసులను రంగంలోకి దింపారు. వారు ఆధార్ నంబరు వివరాలు తెలపడంతో నా సహోద్యోగి వారి మాటలు నమ్మాడు. వెంటనే వారికి నగదు పంపించాడు. సైబర్ మోసాల గురించి ప్రతి ఒక్కరినీ నిరంతరం అప్రమత్తం చేసే సంస్థలో పనిచేసే వ్యక్తికే ఇలా జరిగితే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది ఎవరికైనా జరగొచ్చని కామత్ హెచ్చరించాడు. ఇలాంటి పరిస్థితి ఒకవేళ మీకు ఎదురైతే.. మీతో మాట్లాడటానికి మా లాయర్‌ను తీసుకువస్తానని చెప్పాలని నితిన్ కామత్ యూజర్లకు సూచించాడు. మీరు భయపడట్లేదని తెలిస్తే చాలు దుండగులు మిమ్మల్ని ఏమీ చేయలేరని హితోపదేశం చేశాడు. కామత్ ట్వీట్ చూసిన యూజర్లు ఆన్‌లైన్‌లో వారు ఏవిధంగా మోసపోయారో తెలుపుతున్నారు.