BEENA DAS: బీనా దాస్.. మనం మరచిన అసలైన దేశభక్తురాలు
దేశ సేవకి పెన్షన్ వద్దన్న దేశభక్తురాలు;
బీనా దాస్ – పేరు పెద్దగా వినిపించకపోయినా, ఆమె త్యాగం, ధైర్యం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. 1911లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్‌లో జన్మించిన బీనా, సంఘసేవకులైన సరళాదేవి, మదాబ్ దాస్‌ల కుమార్తె. వారి ఇంటికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తరచూ రావడంతో ఆయన ప్రభావం బీనా, ఆమె అక్క కళ్యాణి దాస్లపై గాఢంగా పడింది. 1931లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం చదువుతున్న బీనా, బ్రిటిష్ అధికారి అకృత్యాలను అరికట్టాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. 1932 ఫిబ్రవరి 6న కాన్వొకేషన్ హాల్లోనే బెంగాల్ గవర్నర్ స్టాన్లీ జాక్సన్‌పై ఐదు సార్లు కాల్పులు జరిపింది. కాల్పులు విఫలమైనా, ఆమె ధైర్యం చరిత్రలో నిలిచింది. ఈ ఘటనకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించబడింది. 1939లో విడుదలై, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో మళ్లీ పాల్గొని, రెండవసారి జైలుకు వెళ్లింది. జైలు జీవితం ముగిసిన తర్వాత 1946-47లో బెంగాల్ ప్రొవిన్షియల్ శాసనసభ సభ్యురాలిగా పనిచేసింది.
స్వాతంత్ర్యం అనంతరం 1947-1951లో శాసనసభలో సేవలందించింది. 1947లో జుగాంతర్ గ్రూప్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు జతీష్ చంద్ర భౌమిక్‌ను వివాహం చేసుకుంది. పేదల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించింది. 1960లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. అయితే భర్త మరణం తర్వాత ఆమె జీవితం కష్టాల్లో కూరుకుంది. చివరి రోజులు రిషికేష్‌లో పేదరికంలో గడిచాయి. 1986 డిసెంబర్ 26న గంగానది ఒడ్డున ఆమె మృతదేహం కనుగొనబడింది. పాక్షికంగా కుళ్లిపోయిన ఆ దేహాన్ని గుర్తించడానికి నెలరోజులు పట్టింది. ఆ శవం బీనా దాస్దని తెలిసినప్పుడు, దేశం ఒక గొప్ప దేశభక్తురాలిని మరచిపోయిందనే చేదు నిజం వెలుగుచూసింది. మరణానంతరం, 2012లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు బి.ఎ. పట్టాను ప్రదానం చేసింది.