VELIGONDA: మూడు దశాబ్దాల కల సాకారం దిశగా వెలిగొండ
కీలక దశకు చేరుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం..
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం పేరు వినగానే చాలామందికి గుర్తుకొచ్చేది కరువు, నీటి కొరత, ఫ్లోరైడ్ సమస్యలతో పోరాడుతున్న ప్రజల జీవితం. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల్లో అధికంగా ఉన్న ఫ్లోరైడ్ కారణంగా వేలాది కుటుంబాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. కాళ్లు వంకరపోవడం, ఎముకలు బలహీనపడటం, మూత్రపిండాల వ్యాధులు వంటి సమస్యలు ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ స్థాయి సాధారణ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉంది. సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్ స్థాయి 0.5 నుంచి 1.5 పీపీఎం మధ్య ఉంటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం వంటి ప్రాంతాల్లో నీటిలో ఫ్లోరైడ్ స్థాయి 5 పీపీఎం నుంచి 7 పీపీఎం వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితుల వల్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఫ్లోరోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు దశాబ్దాల క్రితమే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
శంకుస్థాపన చేసిన చంద్రబాబు
1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం శ్రీశైలం జలాశయం నుంచి నీటిని నల్లమల పర్వతాల కింద సొరంగాల ద్వారా తరలించి మార్కాపురం ప్రాంతంలో నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి చేరవేయడం. అక్కడి నుంచి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు అందించడం, అలాగే సాగునీటి అవసరాలను తీర్చడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్టు అమలు అంత సులభంగా జరగలేదు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో సొరంగాలు తవ్వాల్సి ఉండటంతో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందడంలోనే అనేక సంవత్సరాలు పట్టింది. అనుమతులు ఆలస్యమవడం మాత్రమే కాదు, ప్రభుత్వాలు మారడం, నిధుల కొరత, గుత్తేదారులతో వివాదాలు వంటి అనేక కారణాల వల్ల ప్రాజెక్టు పనులు చాలా కాలం పాటు నెమ్మదిగా సాగాయి. దీంతో వెలిగొండ ప్రాజెక్టు ప్రజలకు ఒక కలగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది జూలై నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు. ఈ ప్రకటనతో స్థానిక ప్రజల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సొరంగాల పనులు దాదాపు పూర్తయ్యాయి. మొత్తం రెండు భారీ సొరంగాలను నల్లమల అటవీ ప్రాంతం కింద తవ్వారు. ఒక్కో సొరంగం సుమారు 19 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. వీటిని అత్యాధునిక యంత్రాలతో విదేశాల నుంచి తీసుకొచ్చిన టన్నెల్ బోరింగ్ మెషీన్ల సహాయంతో తవ్వారు.
శరవేగంగాా పనులు
మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం తవ్వకం కూడా పూర్తయింది. ప్రస్తుతం దానిలో మూడు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు జరుగుతున్నాయి. సొరంగాల్లో తవ్వకం సమయంలో ఒక దశలో టన్నెల్ బోరింగ్ మెషీన్ 11 కిలోమీటర్ల వద్ద నిలిచిపోవడంతో పనులు కొంతకాలం ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం ఆ యంత్రాన్ని బయటకు తీసుకురావాల్సిన పని మిగిలి ఉంది. సొరంగాల నుంచి నీటిని నల్లమల సాగర్ జలాశయానికి తరలించేందుకు ప్రత్యేకంగా ఫీడర్ కాలువ నిర్మిస్తున్నారు. ఈ కాలువ మొత్తం 21.8 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇటీవల ఈ కాలువ లైనింగ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.436 కోట్లు కేటాయించింది. పనులను ప్యాకేజీల వారీగా గుత్తేదారులకు అప్పగించి వేగంగా కొనసాగిస్తున్నారు.
నల్లమల సాగర్ జలాశయం సామర్థ్యం 53.85 టీఎంసీలు కాగా, ఇందులో 43.50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా జూలై నెలలో శ్రీశైలం జలాశయానికి వరదలు వచ్చినప్పుడు ఎలాంటి మోటర్ల అవసరం లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు మళ్లించే విధంగా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఇది ఈ ప్రాజెక్టుకు ఉన్న ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న వేలాది గ్రామాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా మార్కాపురం జిల్లాతో పాటు వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సుమారు 15.25 లక్షల మందికి రెండు దశల్లో తాగునీటిని అందించే ప్రణాళిక ఉంది. అంతేకాకుండా సాగునీటి పరంగా కూడా ఈ ప్రాజెక్టు ఎంతో కీలకం. మొదటి దశలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుండగా, రెండో దశ పనులు పూర్తయ్యాక మొత్తం 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.